కల్కి సినిమా తీసిన శివాలయం ఇదే.. వీడియో ఇదిగో!

  • నెల్లూరు జిల్లా పెరుమాళ్లపురంలో 300 ఏళ్ల క్రితం నిర్మాణం
  • వరదల కారణంగా ఇసుకలో కూరుకుపోయిన ఆలయం
  • రెండేళ్ల కిందట ఆలయాన్ని మళ్లీ గుర్తించిన గ్రామస్థులు
ప్రభాస్ తాజా చిత్రం కల్కి చూశారా.. అందులో కనిపించే శివాలయం నెల్లూరు జిల్లాలోని పెరుమాళ్లాపురం గ్రామం సమీపంలో పెన్నా నది ఒడ్డున ఉంది. పెన్నా నది వరదలకు ఇసుకలో కూరుకుపోయిన ఈ ఆలయం రెండేళ్ల కిందట బయటపడింది. కరోనా కాలంలో గ్రామస్థులు ఈ ఆలయం కోసం నది ఒడ్డున తవ్వకాలు జరపడంతో వెలుగులోకి వచ్చింది. దాదాపు 300 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఆలయానికి సంబంధించిన వివరాలతో విలేజ్ విహారీ అనే యూట్యూబ్ చానల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

పెరుమాళ్లాపురంలో పురాతన శివాలయం బయటపడిందనే వార్తలతో కొంతకాలం కిందట విలేజ్ విహారీ యూట్యూబ్ చానల్ అక్కడికి వెళ్లి ఓ వీడియో తీసింది. చానల్ లో అప్ లోడ్ చేసిన ఈ వీడియో కల్కి సినిమా విడుదలయ్యాక మరోసారి అప్ లోడ్ చేశారు. ఈ వీడియోలో చూపించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఆలయ గోపురం మాత్రం బయటకు కనిపిస్తోంది. ఇసుకలో కూరుకుపోయిన ఆలయంలోకి వెళ్లేందుకు గ్రామస్థులు చిన్న మార్గం చేశారు. లోపల ఇసుకను తొలగించారు. లోపల శివలింగం స్పష్టంగా కనిపిస్తోంది. లోపలి నుంచి చూస్తే ఆలయ గోపురం చాలా ఎత్తులో ఉంది. బయట శిఖరం నాలుగు వైపులా నందులతో, ఇతర శిల్పాలతో ఉంది. ఆలయం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో లోపల ఉన్న విగ్రహాలను ఇతర ఆలయాల్లోకి తరలించారని గ్రామస్థులు చెప్పారు. ఆలయంలో బయటపడ్డ శిల్పాలను పురావస్తు శాఖ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.


More Telugu News