మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ గెలవని గుజరాత్ బీజేపీ నేతకు.. పోలీస్ స్టేషన్‌లో ఘనంగా బర్త్ డే వేడుక.. వీడియో ఇదిగో!

  • బీజేపీ నేత హిమాన్షు చౌహాన్‌తో కేక్ కట్ చేయించిన డీసీపీ
  • హ్యాపీ బర్త్ డే చెబుతూ కేక్ తినిపించిన పోలీసులు
  • విరుచుకుపడుతున్న కాంగ్రెస్, నెటిజన్లు
  • బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అంటూ పోలీసుల వివరణ
  • హ్యాపీ బర్త్ డే అంటూ వీడియోలో స్పష్టంగా వినిపిస్తున్న వైనం
ఆయనేమీ కేంద్రమంత్రి కాదు, రాష్ట్ర మంత్రివర్గంలోనూ ఆయనకు ప్రాతినిధ్యం లేదు. ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు. కనీసం మున్సిపల్ ఎన్నికల్లోనూ గెలవలేదు. కాకపోతే ఆయన బీజేపీ నాయకుడు. పేరు హిమాన్సు చౌహాన్. గుజరాత్. ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే.. ఆయన బర్త్ డే వేడుకలను పోలీసులు ఘనంగా నిర్వహించారు. అది కూడా పోలీస్ స్టేషన్‌లో. అహ్మదాబాద్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ జన్మదిన వేడుకల వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. డీసీపీ కనన్ దేశాయి, ఇతర పోలీసుల సమక్షంలో స్టేషన్‌లోనే కేక్ కట్‌చేసిన చౌహాన్‌కు హ్యాపీ బర్త్ డే అంటూ డీసీపీ కేక్ తినిపించారు. 

ఈ వీడియో కాస్తా వెలుగులోకి రావడంతో వివాదం రాజుకుంది. కాంగ్రెస్ పార్టీ ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేస్తూ ‘బీజేపీ కార్యాలయంగా మారిన పోలీస్ స్టేషన్’ అని క్యాప్షన్ తగిలించింది. దీనిపై పోలీసులు స్పందించారు. అది బర్త్ డే సెలబ్రేషన్ కాదని, హిందూ-ముస్లిం ఐక్యతకు సంబంధించిన బ్లడ్ డొనేషన్ డే అని వివరణ ఇచ్చారు. వీడియోలో మాత్రం పోలీసులు అందరూ బీజేపీ నేత హిమాన్షుకు ‘హ్యాపీ బర్త్ డే టూ యూ’ అని గట్టిగా చెప్పడం వినిపిస్తోంది.

కాంగ్రెస్ నేత అమిత్ చావ్లా మాట్లాడుతూ పోలీసులు గుజరాత్‌లోని బీజేపీ కార్యాలయంలో ఉద్యోగుల్లా మారిపోయారని విమర్శించారు. తమ పార్టీ కార్యకర్తల బర్త్ డే వేడుకల కోసం పోలీస్ స్టేషన్లలో బీజేపీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని గుజరాత్ కాంగ్రెస్ మాజీ చీఫ్ జగదీశ్ ఠాకూర్ ఆరోపించారు.

ఈ వీడియోపై నెటిజన్లు కూడా ఆగ్రహాశాలు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ఆశ్చర్యపడాల్సింది ఏమీ ఉండదని అంటున్నారు. గుజరాత్‌లో మూడు దశాబ్దాల పాలనలో అన్ని ప్రభుత్వ విభాగాలు ధ్వంసమయ్యాయని, అవినీతి పేరుకుపోయిందని విమర్శిస్తున్నారు.


More Telugu News