ముఖ్యమంత్రిపై పరువునష్టం దావా వేసిన పశ్చిమ బెంగాల్ గవర్నర్

  • బెంగాల్ గవర్నర్ పై సీఎం మమత వివాదాస్పద వ్యాఖ్యలు
  • రాజ్ భవన్ లోకి వెళ్లాలంటే మహిళలు భయపడుతున్నారన్న సీఎం 
  • గవర్నర్ నివాసంలో జరుగుతున్న పనులు భయపెట్టేలా ఉన్నాయని విమర్శ
  • కలకత్తా హైకోర్టులో దావా వేసిన గవర్నర్ సీవీ ఆనంద బోస్
బెంగాల్ లో గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి ఫైటింగ్ ముదురుతోంది. గవర్నర్ సీవీ ఆనంద బోస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య కొనసాగుతున్న వివాదం తాజాగా కోర్టు మెట్లెక్కింది. సీఎం మమత వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ గవర్నర్ కలకత్తా కోర్టులో దావా వేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఓ ప్రజాప్రతినిధి అనుచిత వ్యాఖ్యలు, ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడం సరికాదని గవర్నర్ తీవ్రంగా మండిపడ్డారు.

అసలేం జరిగిందంటే..
సీఎం మమతా బెనర్జీ సెక్రటేరియట్ లో జరిగిన ఓ మీటింగ్ లో గవర్నర్ ఆనంద బోస్ ను ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు. రాజ్ భవన్ లో జరుగుతున్న అనుచిత కార్యక్రమాలు చూసి మహిళలు అక్కడికి వెళ్లడానికే భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. గవర్నర్ నివాసంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఇటీవల రాజ్ భవన్ లో జరిగిన సంఘటనల గురించి తెలిశాక అక్కడికి వెళ్లాలంటేనే భయమేస్తోందని కొంతమంది మహిళలు తనకు చెప్పారన్నారు.

రాజ్ భవన్ లో తాను లైంగిక వేధింపులకు గురయ్యానంటూ ఓ కాంట్రాక్ట్ ఉద్యోగిని ఈ నెల 2న పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ప్రస్తావిస్తూ మమతా బెనర్జీ తాజా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన గవర్నర్ ఆనంద బోస్.. సీఎం మమతా బెనర్జీపై కలకత్తా కోర్టులో పరువునష్టం దావా వేశారు. సీఎంతో పాటు టీఎంసీ లీడర్లు మరికొందరిపైనా గవర్నర్ దావా వేసినట్లు సమాచారం.


More Telugu News