147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి.. పురుషులకు కూడా సాధ్యం కాని రికార్డు సాధించిన భారత ఉమెన్స్ జట్టు

భారత్ ఉమెన్స్- దక్షిణాఫ్రికా ఉమెన్స్ జట్ల మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి ఏకంగా 525 పరుగుల భారీ స్కోరు చేసింది. టెస్టు క్రికెట్ చరిత్రలో (పురుషులు, మహిళలు) ఒక జట్టు ఒకే రోజు ఆటలో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరుగా నమోదైంది. 2022లో బంగ్లాదేశ్‌పై శ్రీలంక (పురుషులు) ఒకే రోజు 9 వికెట్ల నష్టానికి చేసిన 509 పరుగుల స్కోరు ఇప్పటివరకు రికార్డుగా ఉంది. ఆ రికార్డు భారత అమ్మాయిలు చెరిపివేశారు. ఇక మహిళల క్రికెట్‌ విషయానికి వస్తే 1935లో క్రైస్ట్‌చర్స్ వేదికగా న్యూజిలాండ్ ఉమెన్స్‌పై ఇంగ్లండ్ ఉమెన్స్ జట్టు ఒకేరోజు 2 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసింది.

కాగా ఈ మ్యాచ్‌లో భారత ఉమెన్ బ్యాటర్లు అదరగొట్టారు. ఓపెనర్ షఫాలీ వర్మ ఏకంగా డబుల్ సెంచరీ బాదింది. 197 బంతుల్లో 205 పరుగులు బాది రనౌట్ అయింది. మరో ఓపెనర్ స్మృతి మంధాన కూడా భారీ శతకాన్ని నమోదు చేసింది. 161 బంతుల్లో 149 పరుగులు సాధించింది. తొలి వికెట్‌కు వీరిద్దరూ కలిసి ఏకంగా 292 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇక సుభా సతీశ 15, జమియా రోడ్రిగేజ్ 55, హర్మాన్‌ప్రీత్ కౌర్ 42(నాటౌట్), రీచా ఘోష్ 43 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.

ఇక దక్షిణాఫ్రికా ఉమెన్స్ బౌలర్ల విషయానికి వస్తే డెల్మీ టక్కర్ రెండు కీలకమైన వికెట్లు తీసింది. అయితే ఆమె ఏకంగా 141 పరుగులు సమర్పించుకుంది. ఇక నదినే డీ క్లెర్క్ ఒక వికెట్ పడగొట్టగా మరో వికెట్ రనౌట్ (షఫాలీ వర్మ) రూపంలో దక్కింది.


More Telugu News