భర్తల మద్యం అలవాటు మాన్పించేందుకు మహిళలకు బీజేపీ నేత సరికొత్త సూచన.. కాంగ్రెస్ అభ్యంతరం!

  • మద్యం, డ్రగ్స్ అలవాట్లపై మధ్యప్రదేశ్‌లో అవగాహన సదస్సు
  • భర్తలు ఇళ్లల్లోనే మద్యం తాగమని మహిళలు సూచించాలని సదస్సులో మంత్రి నారాయణ్ సింగ్ సూచన
  • కుటుంబం ముందు మద్యం తాగలేక అలవాటు నుంచి బయటపడతారని వ్యాఖ్య
  • మంత్రి సలహాతో గృహహింస కేసులు పెరుగుతాయని హెచ్చరిక
భర్తల మద్యం అలవాటు మాన్పించాలనుకున్న మహిళలకు మధ్యప్రదేశ్‌ మంత్రి నారాయణ్ సింగ్ కుష్వాహా చేసిన సూచన ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో, ఘటనపై స్పందించిన కాంగ్రెస్ మంత్రిది సదుద్దేశమే అయినా ఆయన విధానం బాలేదని పేర్కొంది. సామాజిక న్యాయ శాఖ మంత్రి నారాయణ్ సింగ్ కుష్వాహా శుక్రవారం భోపాల్‌లో మాదక ద్రవ్యాలు, మద్యం తదితర దురలవాట్లపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి నారాయణ్ సింగ్ మాట్లాడుతూ భర్తల మద్యం అలవాటు మాన్పించాలంటే వారిని ఇళ్లల్లోనే మద్యం సేవించమని చెప్పాలని మహిళలకు సూచించారు. కుటుంబ సభ్యుల ముందు తాగడం నామోషీగా భావించిన పురుషులు క్రమంగా ఈ అలవాటు నుంచి బయటపడతారని సూచించారు. పిల్లలు కూడా తండ్రినే అనుసరిస్తూ మద్యానికి బానిసలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించాలని కూడా మహిళలకు సూచించారు. ఈ పద్ధతి ఆచరణాత్మకమని, దీంతో, పురుషులు మద్యం అలవాటు నుంచి బయటపడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. 

మంత్రి వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంతో కాంగ్రెస్ రంగంలోకి దిగింది. నారాయణ్ సింగ్ ఉద్దేశం మంచిదే అయినా ఆయన సలహా మాత్రం సబబుగా లేదని అన్నారు. పురుషులు ఇళ్లల్లో తాగడం మొదలెడితే భార్యలతో గొడవలు మరింత తీవ్రమవుతాయని అన్నారు. చివరకు ఇది గృహ హింసకు దారి తీయొచ్చని హెచ్చరించారు. ఇందుకు బదులు పురుషులు ఆ అలవాటును తమంతట తాముగా మానుకోవాలని సూచించి ఉంటే బాగుండేదని పార్టీ మీడియా శాఖ అధ్యక్షుడు ముఖేశ్ నాయక్ వ్యాఖ్యానించారు.


More Telugu News