మంగళగిరి ఎయిమ్స్ కు నీటి కొరతపై సీఎం చంద్రబాబు విస్మయం

  • ప్రతిష్ఠాత్మక రీతిలో మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటు
  • సీఎం చంద్రబాబును కలిసి సమస్యలు విన్నవించిన ఎయిమ్స్ డైరెక్టర్
  • తప్పకుండా సమస్యలు పరిష్కరిస్తామని ఎయిమ్స్ డైరెక్టర్ కు చంద్రబాబు హామీ
మంగళగిరిలో ఏర్పాటైన ప్రతిష్ఠాత్మక ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కు నీటి సమస్య ఏర్పడడం పట్ల సీఎం చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మధుబానందకర్ నేడు సీఎం చంద్రబాబును కలిశారు. 

ఎయిమ్స్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నీటి కొరత అని ఆయన చంద్రబాబుకు వివరించారు. నీటి కొరత ఇబ్బందుల వల్ల సేవలను విస్తరించలేకపోతున్నామని తెలిపారు. ఎయిమ్స్ కు మరో 10 ఎకరాలు అదనంగా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సరఫరా విషయంలోనూ ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు. ఓసారి ఎయిమ్స్ ను సందర్శించాలని డాక్టర్ మధుబానందకర్ సీఎం చంద్రబాబును కోరారు. 

చంద్రబాబు స్పందిస్తూ... వీలైనంత త్వరగా నీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సాంకేతిక, ఆర్థిక సమస్యలతో ఎయిమ్స్ కు నీటి సరఫరా నిలిచిపోవడం పట్ల సీఎం చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

గత సర్కారు ఐదేళ్లుగా ఎయిమ్స్ లో నీటి సమస్యను పట్టించుకోకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మంగళగిరి ఎయిమ్స్ ను దేశంలోనే టాప్-3లో ఉంచేందుకు కృషి చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.


More Telugu News