ఫైనల్ మ్యాచ్‌‌కు వర్షం కురిసే అవకాశం పుష్కలం.. ఒకవేళ మ్యాచ్ రద్దయితే కప్ ఎవరికి ఇస్తారంటే..!

  • ఫైనల్ మ్యాచ్‌కు పొంచివున్న వానగండం
  • శనివారంతో పాటు రిజర్డ్ డే అయిన ఆదివారం కూడా వర్షం ముప్పు
  • మ్యాచ్ రద్దయితే సంయుక్త విజేతలుగా నిలవనున్న భారత్, దక్షిణాఫ్రికా
ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ను రెండోసారి ముద్దాడాలని టీమిండియా.. చరిత్రలో తొలిసారి ఐసీసీ టైటిల్ గెలవాలని దక్షిణాఫ్రికా.. లీగ్ దశలో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోని ఈ రెండు జట్ల మధ్య మరికొన్ని గంటల్లోనే ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. క్రికెట్ ప్రపంచమంతా ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. అయితే బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచివుంది. ఆటకు వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వెదర్ రిపోర్టులు చెబుతున్నాయి. 99 శాతం మేఘావృతమై ఫైనల్ మ్యాచ్‌ సమయంలో వానపడే అవకాశం ఉందని ‘ఆక్యూవెదర్’ రిపోర్ట్ పేర్కొంది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, తేమ శాతం కూడా అధికంగా ఉంటుందని, ఈదురు గాలులు వీయనున్నాయని అంచనా వేసింది. వర్షం పడుతూ తగ్గుతూ.. ఉరుములతో కూడిన గాలివాన పడొచ్చని ‘ఆక్యూవెదర్’ పేర్కొంది.

అయితే శనివారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే రిజర్వ్ డే అందుబాటులో ఉంది. అంటే ఆదివారం ఇరు జట్లు ఫైనల్ ఆడాల్సి ఉంది. అయితే ఆదివారం కూడా వర్షం ముప్పు పొంచివుందని వాతావరణ రిపోర్టులు అంచనా వేశాయి. ఒకవేళ ఆదివారం కూడా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి? అనే సందేహాలు క్రికెట్ ఫ్యాన్స్‌లో వ్యక్తమవుతున్నాయి. అనూహ్యంగా రెండు రోజులు వర్షం పడి మ్యాచ్‌ తుడిచిపెట్టుకుపోతే ఐసీసీ రూల్స్ ప్రకారం.. భారత్, దక్షిణాఫ్రికా రెండూ సంయుక్త విజేతలుగా నిలుస్తాయి. టీ20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని ఇరు జట్లు గెలిచినట్టు ప్రకటిస్తారు.


More Telugu News