తన కేబినెట్లో మంత్రిగా ఎవరికి అవకాశం ఉంటుందో చెప్పిన రేవంత్ రెడ్డి

  • కాంగ్రెస్ బీఫాంపై పోటీ చేసిన వారికి మాత్రమే కేబినెట్లో అవకాశం ఉంటుందని స్పష్టీకరణ
  • జులై 7న పీసీసీ చీఫ్‌గా పదవీ కాలం ముగియనుందన్న రేవంత్ రెడ్డి
  • తెలంగాణలో కరెంట్ కోతలు లేవు... అంతరాయాలు మాత్రమే ఉన్నాయన్న సీఎం
  • రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని వెల్లడి
కాంగ్రెస్ పార్టీ బీఫాంపై పోటీ చేసిన వారికే కేబినెట్లో అవకాశం ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణకు రూ.7 లక్షల కోట్ల అప్పులు అయ్యాయన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పోస్టింగ్స్‌లో తాము రూల్స్‌‌ను బ్రేక్ చేయదల్చుకోలేదని స్పష్టం చేశారు.

టీపీసీసీ చీఫ్‌గా తాను రెండు కీలక ఎన్నికలను పూర్తి చేశానన్నారు. రెండింట్లోనూ మంచి ఫలితాలను సాధించినట్లు చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా తన పదవీకాలం జులై 7న పూర్తి కానుందన్నారు. పీసీసీ చీఫ్ పదవితో పాటు కేబినెట్‌లోకి ఎవరిని తీసుకోవాలనే నిర్ణయాలు ఒకేసారి ఫైనల్ అవుతాయన్నారు. తెలంగాణలో ఎలాంటి కరెంట్ కోతలు ఉండవని హామీ ఇచ్చారు. పంపిణీలో మాత్రం అంతరాయాలు ఉన్నట్లు చెప్పారు. మహిళలకు ఉచిత పథకంతో ఆర్టీసీ గాడిన పడిందన్నారు.

రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు

రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. పంటల రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదన్నారు. రేషన్ కార్డు... కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసమే అన్నారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రెండు రోజుల్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఉంటాయన్నారు. తెలంగాణ బడ్జెట్ వాస్తవ అంచనాలకు అనుగుణంగా ఉండాలని అధికారులకు చెప్పినట్లు తెలిపారు.


More Telugu News