వచ్చే నెలలో ఒకే వేదికపైకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి

  • జులై మూడో వారంలో ప్రపంచ కమ్మ మహాసభ 
  • హైదరాబాద్ హెచ్ఐసీసీలో కార్యక్రమం
  • ముఖ్య అతిథులుగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
రాజకీయాల్లో చంద్రబాబు, రేవంత్ రెడ్డిలను గురుశిష్యులుగా చెప్పుకుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రేవంత్ రెడ్డి టీడీపీలో బలమైన నేత అని తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా, రాష్ట్ర కాంగ్రెస్ సారథిగా ఉన్నారు. చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. త్వరలోనే వీళ్లిద్దరూ ఒక వేదికపై కనిపించనున్నారు. 

జులై మూడో వారంలో మొట్టమొదటి ప్రపంచ కమ్మ మహాసభలు హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల సీఎంల హోదాలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఈ విషయాన్ని కమ్మ మహాసభ నిర్వాహకుడు జెట్టి కుసుమకుమార్ వెల్లడించారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ ఈ ప్రపంచ కమ్మ మహాసభ వేడుకలకు వేదికగా నిలవనుంది. ఈ సభలకు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ముఖ్య అతిథిగా రానున్నారు. 

తెలంగాణలో రేవంత్ ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు విషెస్ తెలుపగా, ఏపీలో ఇటీవల చంద్రబాబు సీఎం అయ్యాక రేవంత్ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేతప్ప, ఈమధ్య కాలంలో వీరిరువురు పరస్పరం కలిసింది లేదు. ఇప్పుడు వీరిద్దరి కలయికకు ప్రపంచ కమ్మ మహాసభ వేదిక కానుంది.


More Telugu News