షఫాలీ వ‌ర్మ విధ్వంసకర బ్యాటింగ్.. మహిళల టెస్టు క్రికెట్ లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ ప్లేయర్‌గా రికార్డు!

  • చిదంబరం స్టేడియంలో దక్షిణాఫ్రికాతో భార‌త్‌ ఏకైక టెస్టు
  • కేవ‌లం 194 బంతుల్లోనే ద్విశ‌త‌కం చేసి రికార్డుకెక్కిన షఫాలీ 
  • 20 ఏళ్ల  షఫాలీకి ఈ ఫార్మాట్‌లో ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భార‌త మ‌హిళా జ‌ట్టు ఓపెన‌ర్ షెఫాలీ వ‌ర్మ విధ్వంసం సృష్టించింది. మహిళల టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో ఆమె ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డుకెక్కింది. కేవ‌లం 194 బంతుల్లోనే 8 సిక్స‌ర్లు, 22 బౌండ‌రీలతో ద్విశ‌త‌కం న‌మోదు చేసింది. 20 ఏళ్ల షఫాలీ వర్మకు ఈ ఫార్మాట్‌లో ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ. మొత్తంగా 205 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ వద్ద ఆమె పెవిలియ‌న్ చేరింది.

హిళల టెస్టుల్లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీలు
194 బంతులు - షఫాలీ వర్మ (భార‌త్‌) vs సౌతాఫ్రికా (2024)
256 బంతులు - అన్నాబెల్ సదర్లాండ్ (ఆస్ట్రేలియా) vs దక్షిణాఫ్రికా (2024)
313 బంతులు - కరెన్ రోల్టన్ (ఆస్ట్రేలియా) vs ఇంగ్లాండ్ (2001)
345 బంతులు - మిచెల్ గోస్కో (ఆస్ట్రేలియా) vs ఇంగ్లాండ్ (2001)
374 బంతులు - ఎల్లీస్ పెర్రీ (ఆస్ట్రేలియా) vs ఇంగ్లాండ్ (2017)

భార‌త ఓపెన‌ర్ల వ‌ర‌ల్డ్ రికార్డు!
ఇదే మ్యాచ్‌లో భార‌త ఓపెన‌ర్లు స్మృతి మంధాన‌, షెఫాలీ వ‌ర్మ అంత‌ర్జాతీయ మ‌హిళ‌ల టెస్టుల్లో అత్య‌ధిక ఓపెనింగ్ భాగ‌స్వామ్యం (292 ప‌రుగులు)  నెల‌కొల్పిన ద్వ‌యంగా వ‌ర‌ల్డ్ రికార్డు సృష్టించారు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు పాక్ జోడీ స‌జ్జిదా షా, కిర‌ణ్ బ‌లూచ్ (241) పేరిట ఉండేది. ప్ర‌స్తుతం మ్యాచ్‌లో భార‌త్ స్కోరు 467/4 (92 ఓవ‌ర్లు) గా ఉంది. స్మృతి మంధాన కూడా శ‌త‌కం (149) తో క‌దం తొక్కింది.


More Telugu News