జియో బాటలో ఎయిర్‌టెల్.. ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ ధరల పెంపు

  • జులై 3 నుంచి అమల్లోకి కొత్త ధరలు
  • ప్లాన్ల రకం, వ్యాలిడిటీని బట్టి గరిష్ఠంగా 21 శాతం వరకు పెంపు
  • యాడ్ ఆన్ ప్యాక్‌ల ధరలపైనా భారం
  • రోజుకు 70 పైసల కంటే తక్కువేనన్న ఎయిర్‌టెల్
మొబైల్ టారిఫ్ ధరలు పెంచడంలో టెలికం కంపెనీలు పోటీపడుతున్నాయి. జులై 3 నుంచి కొత్త ధరలు అమల్లోకి తీసుకొస్తున్నట్టు రిలయన్స్ జియో నిన్న ప్రకటించింది. తాజాగా, మరో దిగ్గజ సంస్థ భారతి ఎయిర్‌టెల్ కూడా ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇవి కూడా జులై 3 నుంచే అమల్లోకి వస్తాయని ఎయిర్‌టెల్ ప్రకటించింది. 

ప్లాన్ల రకం, వ్యాలిడిటీని బట్టి పెంపు 11 నుంచి 21 శాతం వరకు ఉన్నట్టు తెలిపింది. యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ఏఆర్‌పీయూ) రూ.300కుపైగా ఉండాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగానే ధరలు పెంచుతున్నట్టు వివరించింది. ధరల పెంపు ద్వారా వినియోగదారుడిపై రోజుకు పడే భారం 70 పైసల కంటే తక్కువేనని తెలిపింది. ధరల పెంపు ద్వారా వచ్చిన ఆదాయాన్ని మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగిస్తామని పేర్కొంది.

కొత్త ప్లాన్లు ఇలా..
ప్రస్తుతం రూ. 179గా ఉన్న ప్లాన్ ధరను రూ. 199కి పెంచింది. 2జీబీ డేటా, అపరిమిత కాలింగ్ సౌకర్యం, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లతో కూడిన ఈ ప్లాన్ 28 రోజుల కాల పరిమితితో లభిస్తుంది.

ప్రస్తుతం రూ. 455గా ఉన్న ప్లాన్ ధరను రూ. 509కి పెంచింది. 84 రోజుల కాలపరిమితితో లభించే ఈ ప్లాన్‌లో 6జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి.

365 రోజుల కాలపరిమితితో ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ.1,799 ప్లాన్ ధరను ఏకంగా రూ.1,999 చేసింది. 24 జీబీ డేటా, అపరిమిత కాలింగ్ సౌకర్యం, రోజుకు 100 ఎస్సెమ్మెలు లభిస్తాయి.

రూ. 265 ప్లాన్ ధర ఇకపై రూ. 299కు లభించనుంది. ఇందులో రోజుకు ఒక జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు 28 రోజుల కాలపరిమితితో లభిస్తాయి.

రూ.299గా ఉన్న ప్లాన్ ధరను రూ. 349కి పెంచింది. 28 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో రోజుకు 1.5జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. 

ఇవే కాదు.. సంస్థ అందించే అన్ని రకాల రీచార్జ్ ప్లాన్ ధరలను పెంచింది. డేటా యాడ్ ఆన్ ప్యాక్‌లు, పోస్టు పెయిడ్ ప్లాన్ల ధరలను కూడా పెంచిన ఎయిర్‌టెల్ భారతి హెక్సాకామ్ లిమిటెడ్‌తోపాటు అన్ని సర్కిళ్లకు పెరిగిన ధరలు వర్తిస్తాయని తెలిపింది. సవరించిన ధరలు వచ్చే నెల 3 నుంచి ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

         


More Telugu News