ఒకరి ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్స్ బుక్ చేస్తే జైలుశిక్ష విధిస్తారా?.. రైల్వే సమాధానం ఇదే!

  • సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన ఇండియన్ రైల్వేస్
  • స్నేహితులు, బంధువులకు బుక్ చేసుకోవచ్చని వెల్లడి
  • వేర్వేరు ఇంటి పేర్లు ఉన్న వ్యక్తులకు టికెట్ బుకింగ్‌పై పరిమితి లేదని స్పష్టత
చాలా మంది రైల్వే ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, ఐఆర్‌సీటీసీ యాప్‌పై టికెట్లు బుక్ చేసుకుంటారు. ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఈ అధికారిక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై ప్రతి నిత్యం వేలాది మంది సేవలు పొందుతున్నారు. తమకు తాము బుక్ చేసుకోవడంతో పాటు ఇతరులకు కూడా బుకింగ్ చేస్తుంటారు. అయితే ఐఆర్‌సీటీసీ ప్లాట్‌ఫామ్‌పై ఒకరి ఐడీని ఉపయోగించి ఇతరులకు టికెట్లు బుక్ చేయడం నేరమని, ఇందుకు జైలుశిక్ష పడుతుందంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని నమ్మి వేలాది మంది ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం రైల్వే దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఐఆర్‌సీటీసీపై రైల్వే టికెట్ల బుకింగ్‌కు సంబంధించిన నిబంధనలను ఇండియన్ రైల్వేస్ వివరించింది. 

ఐఆర్‌సీటీసీపై ఒకరి ఐడీ నుంచి ఇతరులకు టికెట్ బుక్ చేస్తే జైలుశిక్ష పడుతుందనేది అవాస్తవమని, ఈ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. యూజర్లు తమ ఐడీని ఉపయోగించి వేర్వేరు ఇంటి పేర్లు ఉన్న వ్యక్తులకు టిక్కెట్‌లు బుక్ చేయవచ్చునని క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఐఆర్‌సీటీసీ ఈ-బుకింగ్‌కు సంబంధించిన పలు నిబంధనలను వెల్లడించింది.

1. ఐఆర్‌సీటీసీ యూజర్లు వారి వ్యక్తిగత ఐడీని ఉపయోగించి స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా బంధువులకు టిక్కెట్లు బుక్ చేయవచ్చు. వేర్వేరు ఇంటి పేర్లు ఉన్న వ్యక్తులకు టిక్కెట్ల బుకింగ్‌పై ఎలాంటి పరిమితి లేదు.
2. ఇక వ్యక్తిగత ఐడీని ఉపయోగించి నెలకు గరిష్ఠంగా 12 టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. మరో వ్యక్తి ఆధార్‌ను కూడా అనుసంధానించి ఇద్దరి ఐడీలపై కలిపి నెలకు గరిష్ఠంగా 24 టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

అయితే వ్యక్తిగత ఐడీలను ఉపయోగించి బుక్ చేసిన టిక్కెట్లు వాణిజ్యపరంగా విక్రయించకూడదని ఇండియన్ రైల్వేస్ స్పష్టం చేసింది. భారతీయ రైల్వే చట్టం-1989లోని సెక్షన్ 143 ప్రకారం ఇలాంటి కార్యకలాపాలు నేరంగా పరిగణిస్తారు. దీనిని బట్టి ఐఆర్‌సీటీసీపై వ్యక్తిగత అవసరాలు, అవసరమైతే తమ బంధువులు, స్నేహితులకు బుక్ చేసుకోవచ్చని స్పష్టమవుతోంది.


More Telugu News