గ్రీన్ సిగ్నల్ కోసం ట్రాఫిక్ కూడలి వద్ద ఆగిన ఆవు.. వైరల్ వీడియో ఇదిగో!

  • పూణెలో ఘటన, వీడియోను షేర్ చేసిన స్థానిక పోలీసులు
  • రెడ్ సిగ్నల్ పడగానే ఆగిపోయిన ఆవు, సిగ్నల్ మారాక ముందుకు కదిలిన వైనం
  • ఆవు లాగే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్న పోలీసులు
  • ఆవులు, గేదెలను వీధుల్లోకి వదలడం బాధ్యతారాహిత్యం, ప్రమాదకరమంటూ నెటిజన్ల ఆవేదన
పసుపు పచ్చ, రెడ్ సిగ్నల్స్ పడ్డా ఆగని వాహనదారులున్న ఈ జమానాలో ఓ ఆవు ట్రాఫిక్ నిబంధనలను గౌరవిస్తూ ట్రాఫిక్ కూడలి వద్ద గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూడటం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. పూణెలో ఈ ఘటన వెలుగు చూసింది. 

ఓ ట్రాఫిక్ కూడలి వద్ద రెడ్ సిగ్నల్ పడటంతో ఆవు ఆగిపోయింది. తెల్లగీతను దాటకుండా నిలబడింది. వెనక హారన్లు మోగుతున్నా అది పట్టించుకోలేదు. ఇతర వాహనదారుల వలెనే అది గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూసింది. సిగ్నల్ మారగానే ముందుకు కదిలింది. 

ఈ వీడియోను షేర్ చేసిన పూణె పోలీసులు వాహనదారులకు కీలక సూచనలు కూడా చేశారు. రెడ్ లైట్ ఉన్నప్పుడు ఆవు లాగా ఆగిపోండి అంటూ సరదా కామెంట్ చేశారు. మరోవైపు, వీడియోకు జనాల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. తాము ఇలాంటి ఘటన ఎక్కడా చూడలేదని అనేక మంది వ్యాఖ్యానించారు. వాహనదారులకంటే ఆవుకే నిబద్ధత ఎక్కువని కొందరు కీర్తించారు. 

కొందరు మాత్రం పూణె పోలీసులపై కీలక ప్రశ్నలు సంధించారు. ఆవులు, ఇతర జంతువులు రహదారుల్లో ఇలా తిరగడం వాహనదారులకు ప్రమాదకరం కాదా అని ప్రశ్నించారు. ఆవు యజమానిది బాధ్యతారాహిత్యమని కొందరు విమర్శించారు. జంతువులను ఇలా రహదారులపై వదలడం వాటికి కూడా ప్రమాదమేనని పేర్కొన్నారు.


More Telugu News