ఎట్టకేలకు ప్రారంభమైన టీమిండియా-ఇంగ్లండ్ సెమీస్... అంతలోనే మళ్లీ వర్షం

  • గయానాలో తగ్గిన వాన
  • ఆలస్యంగా ప్రారంభమైన టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • మరోసారి స్వల్ప స్కోరుకే అవుటైన కోహ్లీ
వరుణుడు కరుణించడంతో టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా, ఇంగ్లండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ ఎట్టకేలకు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం పిచ్ పై తేమను సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మొదట బౌలింగ్ ఎంచుకున్నట్టు అర్థమవుతోంది. 

ఈ నేపథ్యంలో, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 2.4 ఓవర్లలో 19 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓ సిక్స్ బాది ఊపుమీదున్నట్టు కనిపించిన విరాట్ కోహ్లీ... అదే ఓవర్లో రీస్ టాప్లే బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కోహ్లీ 9 పరుగులు చేశాడు. 

8 ఓవర్ల వద్ద వరుణుడి బ్రేక్

8 ఓవర్లు ముగిసిన అనంతరం వరుణుడు ప్రత్యక్షం కావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. అప్పటికి టీమిండియా 2 వికెట్లకు 65 పరుగులు స్కోరు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 37, సూర్యకుమార్ యాదవ్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు, ఓపెనర్ విరాట్ కోహ్లీ 9, రిషబ్ పంత్ 4 పరుగులకే అవుటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లే 1, శామ్ కరన్ 1 వికెట్ తీశారు.


More Telugu News