కొంతమంది వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదు: కేసీఆర్

  • తెలంగాణ సాధించిన ఘనత కంటే తనకు సీఎం పదవి పెద్ద విషయమేమీ కాదని వ్యాఖ్య
  • సాగునీరు, తాగునీరు, కరెంట్ వంటి ఎన్నో వసతులు కల్పించుకున్నామన్న కేసీఆర్
  • కాంగ్రెస్ ఇచ్చిన అలవిగాని హామీలను నమ్మి ప్రజలు అనూహ్యంగా మోసపోయారన్న కేసీఆర్
కొంతమంది వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తనను కలిసేందుకు ఎర్రవెల్లి నివాసానికి వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో పదవులను త్యాగం చేసిన చరిత్ర మనది అన్నారు. తెలంగాణ సాధించిన ఘనత కంటే తనకు ముఖ్యమంత్రి పదవి పెద్ద విషయమేమీ కాదన్నారు. తెలంగాణ సాధించేనాటికి సమైక్యపాలనలో మనది దిక్కు మొక్కులేని పరిస్థితి అన్నారు. సాగునీరు, తాగునీరు, కరెంట్ వంటి ఎన్నో వసతులు కల్పించుకున్నామన్నారు. కానీ ఇలాంటి కీలక సమయంలో వచ్చిన ఎన్నికల్లో ప్రజలు ఊహించని తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. కానీ పదేళ్ల తక్కువ కాలంలోనే తెలంగాణలో అద్భుతమైన ప్రగతిని సాధించుకున్నామన్నారు.

కొన్నిసార్లు ఇలాంటి తమాషాలు జరుగుతుంటాయని... చరిత్రలోకి వెళ్తే అంతా అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అలవిగాని హామీలను నమ్మి ప్రజలు అనూహ్యంగా మోసపోయారని వ్యాఖ్యానించారు. పాలిచ్చే బర్రెను వదిలి ప్రజలు దున్నపోతును తెచ్చుకున్నట్లయిందన్నారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు కూడా బాధపడుతున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన అనేక పథకాలు తమకు అందడం లేదని ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి దరికి తెచ్చిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో దారి తప్పిందని మండిపడ్డారు. అయినప్పటికీ ఆందోళన అవసరం లేదన్నారు.

బీఆర్ఎస్‌ను తిరిగి గద్దె మీద కూర్చుండబెట్టే రోజు త్వరలో మళ్లీ వస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణ కోసం సాగిన మన పాతికేళ్ల సుదీర్ఘ ప్రయాణం ఆగలేదు... అయిపోలేదని వ్యాఖ్యానించారు. నాడు ఎన్టీఆర్‌ను ప్రజలు ఎలాగైతే తిరిగి గద్దె మీద కూర్చోబెట్టారో... అంతకంటే గొప్పగా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరిగి ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన రోజురోజుకు దిగజారుతోందన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన... కాంగ్రెస్ నిచ్చెన మెట్లు ఎక్కడం మానివేసి... మొదటి దశలోనే మెట్లు దిగజార్చుకుంటూ నడుస్తోందని విమర్శించారు.

మన పార్టీ నాయకులను తయారు చేస్తుందని... కొంతమంది నాయకులు వెళ్లినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదన్నారు. పార్టీకి బుల్లెట్ల వంటి కార్యకర్తలు ఉన్నారన్నారు. అలాంటి వారిని నాయకులుగా తీర్చుదిద్దుకుంటామన్నారు. పార్టీ బీ ఫామ్ ఇచ్చి అవకాశమిస్తే ఎవరైనా సిపాయిలుగా తయారవుతారన్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చి తమకు కాంగ్రెస్ ద్వారా జరిగిన మోసాన్ని గుర్తించి తిరిగి బీఆర్ఎస్‌ను ఆదరించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఓపికతో ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని... పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు.


More Telugu News