ఉద్యోగాలు పెంచమని అడిగితే సాంకేతిక కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారు: కేటీఆర్

  • గ్రూప్స్‌లో ఉద్యోగాలు పెంచుతామని రేవంత్ రెడ్డి చెప్పారన్న కేటీఆర్
  • మొదటి కేబినెట్లోనే మెగా డీఎస్సీ అని నిరుద్యోగులను మోసం చేశారని విమర్శ
  • నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గ్రూప్స్‌లో ఉద్యోగాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరితే సాంకేతిక కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల సమయంలో గ్రూప్ 2లో 2వేలు, గ్రూప్ 3లో వేలాది ఉద్యోగాలు పెంచుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ పెంచలేదన్నారు.

మొదటి కేబినెట్ భేటీలోనే మెగా డీస్సీ అని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. ఇక గ్రూప్ 1కు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన దానికి కేవలం 60 ఉద్యోగాలు మాత్రమే జత చేశారన్నారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చి ఇప్పుడు వాటిని పట్టించుకోవటం లేదన్నారు. ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ పేరుతో పెద్ద ఎత్తున అడ్వర్టైజ్‌మెంట్లు అన్ని పత్రికల్లో ఇచ్చారన్నారు.

దాదాపు 10 పరీక్షలకు సంబంధించి డేట్లతో పాటు నోటిఫికేషన్లు అంటూ తేదీలు ప్రకటించారని... వాటికి సంబంధించి ఒక్క నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేయలేదన్నారు. వెంటనే ఆ నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని... వారి కోసం పోరాడుతుందని హామీ ఇచ్చారు.


More Telugu News