ముఖ్యమంత్రి కావాలనే నా ఆకాంక్ష నెరవేరింది: రేవంత్ రెడ్డి

  • కేసీఆర్‌ను గద్దె దించాలనే జీవిత లక్ష్యం నెరవేరిందన్న సీఎం
  • ఇక తన ముందు ఉన్నది... తెలంగాణ పునర్నిర్మాణమేనని వ్యాఖ్య
  • పీసీసీ పదవీ కాలం ముగిసిందన్న రేవంత్ రెడ్డి
  • ఎవరికి బాధ్యతలు అప్పగించినా కలిసి పని చేస్తానని స్పష్టీకరణ
  • తన హయాంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న సీఎం
కేసీఆర్‌ను గద్దె దింపాలన్న తన జీవిత లక్ష్యం... అలాగే ముఖ్యమంత్రిని కావాలనే తన ఆకాంక్ష నెరవేరాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక తన ముందు ఉన్నది తెలంగాణ పునర్నిర్మాణం మాత్రమేనన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు.  తన పీసీసీ పదవీ కాలం ముగిసిందని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పని చేస్తానన్నారు. అధ్యక్షుడి నియామకంపై తనకంటూ ప్రత్యేక ఛాయిస్ ఏమీ లేదని వెల్లడించారు.

తన పదవీ కాలంలోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మంచి పనితీరును కనబరిచామన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటింగ్ శాతం పెరిగిందని గుర్తు చేశారు. తెలంగాణలో కేసీఆర్ పూర్తిగా చేతులెత్తేశారని... అందుకే బీజేపీ బలం పెరిగిందన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ పూర్తిగా ధ్వంసమైందని విమర్శించారు.

బీఆర్ఎస్‌కు డిపాజిట్లు వచ్చిన చోట తాము గెలిచామని, బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయిన చోట బీజేపీ గెలిచిందన్నారు.  తాను కక్షపూరిత రాజకీయాలకు పాల్పడబోనని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీని లోక్ సభలో జీరో చేశామని... ఆ పార్టీని సున్నా చేయాలన్న తన కోరిక నెరవేరిందన్నారు.


More Telugu News