భార‌త్‌, ఇంగ్లండ్ మ‌ధ్య రెండో సెమీస్.. గ‌యానాలో వాతావ‌ర‌ణంపై కీల‌క అప్డేట్‌!

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ముగిసిన సెమీస్‌-1 పోరు
  • ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించి ఫైన‌ల్‌కు చేరిన ద‌క్షిణాఫ్రికా 
  • దీంతో ఇప్పుడు అంద‌రి దృష్టి రెండో సెమీస్‌పైనే 
  • ఈ కీల‌క మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించే అవ‌కాశం 
  • ఫ్యాన్స్‌కు తీపి క‌బురు చెప్పిన గ‌యానా వాతావ‌ర‌ణ శాఖ‌
టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా సెమీస్‌-1 పోరు ముగిసింది. ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించి ద‌క్షిణాఫ్రికా ఫైన‌ల్‌కు చేరింది. ఇప్పుడు రెండో సెమీ ఫైన‌ల్‌లో భార‌త్‌, ఇంగ్లండ్ త‌ల‌ప‌డ‌నున్నాయి. దీంతో ఇప్పుడు అందరూ ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు. భారత కాలమానం ప్రకారం, ఇవాళ రాత్రి 8 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, ఈ కీల‌క మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించే అవ‌కాశం ఉంద‌ని తెలియ‌డంతో అభిమానులు కంగారు ప‌డుతున్నారు. 

ఈ క్రమంలో, ఫ్యాన్స్‌కు ఊర‌ట‌నిచ్చే న్యూస్ చెప్పింది గ‌యానా వాతావ‌ర‌ణ శాఖ‌. ఇప్ప‌టివ‌ర‌కు అక్క‌డ వాతావ‌ర‌ణం పొడిగానే ఉన్న‌ట్లు అక్క‌డి వాతావ‌ర‌ణ నివేదిక‌లు వెల్ల‌డించాయి. కానీ, మ్యాచ్ మొద‌ల‌య్యే స‌మ‌యానికి చిరుజ‌ల్లులు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. అది కూడా కొద్దిసేపు మాత్ర‌మే ఉంటుంద‌ట‌. ఆ త‌ర్వాత మ‌ళ్లీ పొడి వాతావ‌ర‌ణం ఉంటుంద‌ని చెప్పుకొచ్చింది. 

ఒక‌వేళ ఈ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయితే మాత్రం భార‌త్ నేరుగా ఫైన‌ల్‌లోకి అడుగు పెడుతుంది. ఎందుకంటే సూప‌ర్‌-8లో టీమిండియా గ్రూప్‌-1లో టాప్‌లో నిలిచింది. ఐసీసీ రూల్స్ ప్ర‌కారం మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయితే ఇలా గ్రూప్‌లో అగ్ర‌స్థానంలో ఉన్న జ‌ట్టు ఫైన‌ల్‌కి వెళ్లే వెసులుబాటు ఉంది. 

ఇక భార‌త్‌, ఇంగ్లండ్ రెండో సెమీస్‌కు రిజ‌ర్వ్‌డే లేని విష‌యం తెలిసిందే. కానీ, వ‌ర్షం వ‌ల్ల మ్యాచ్ ఆల‌స్య‌మైతే ముగించ‌డానికి అద‌నంగా 250 నిమిషాల స‌మ‌యం ఉంటుంది. అందుకే రెండు జ‌ట్లు క‌నీసం 10 ఓవ‌ర్ల చొప్పున ఆడితేనే ఫ‌లితాన్ని ప్ర‌క‌టించ‌డం జ‌రుగుతుంది. లేక‌పోతే మ్యాచ్ ర‌ద్దు అవుతుంది.


More Telugu News