విజయవాడ కోర్టులో నటుడు పృథ్వీరాజ్‌కు బిగ్ రిలీఫ్

  • వరకట్న వేధింపుల కేసు కొట్టివేత
  • నేరారోపణలు రుజువు కాకపోవడంతో అనుకూలంగా తీర్పు
  • అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ కేసు పెట్టిన భార్య శ్రీలక్ష్మీ
‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ డైలాగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న సినీ నటుడు పృథ్వీరాజ్‌‌కు ఊరట లభించింది. అదనపు వరకట్నం కోసం వేధిస్తున్నాడంటూ ఆయన భార్య శ్రీలక్ష్మి పెట్టిన కేసును విజయవాడ రెండో ఏసీఎంఎం (అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌) కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు బుధవారం కోర్టు తీర్పు ఇచ్చింది. విచారణలో పృథ్వీరాజ్‌పై నేరారోపణలు రుజువు కాకపోవడంతో కేసును కొట్టివేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. న్యాయాధికారి మాధవీదేవి ఈ మేరకు తీర్పు వెలువరించారు. విచారణ కోసం నటుడు పృథ్వీ బుధవారం విజయవాడలోని రెండో ఏసీఎంఎం కోర్టుకు హాజరయ్యారు.

కాగా అదనపు కట్నం కోసం పృథ్వీరాజ్ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ ఆయన భార్య శ్రీలక్ష్మి  2016లో కేసు పెట్టారు. ఈ కేసుపై 2017లో రెండో ఏసీఎంఎంలో ఛార్జిషీట్‌ దాఖలైంది. అప్పటినుంచి వాదనలు కొనసాగుతుండగా బుధవారం తీర్పు వెలువడింది.

పెళ్లి సమయంలో డబ్బు, బంగారు నగలు ఇచ్చినా ఇంకా అదనపు కట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. సినిమాల్లో నటించే ఆయన హైదరాబాద్‌‌ వెళ్లిన తర్వాత వ్యసనాలకు అలవాటు పడ్డారని, తనను పట్టించుకోవడం లేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు చేయడంతో విజయవాడలోని సూర్యారావుపేట స్టేషన్‌లో సెక్షన్‌ 498ఏ కింద వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు.


More Telugu News