అరెస్ట్ చేయడానికి వస్తే పిన్నెల్లి బాత్రూంలో దాక్కున్నాడు... తమ్ముడు గోడ దూకి పారిపోయాడు: టీడీపీ నేత పట్టాభి

  • పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిరికి సన్నాసి అన్న పట్టాభి
  • వెంకట్రామిరెడ్డిని ఈడ్చుకొచ్చి కటకటాల వెనక్కి పంపిస్తామని వ్యాఖ్య
  • పిన్నెల్లి దౌర్జన్యాలు ఎదుర్కొన్న వారు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని సూచన
  • పిన్నెల్లి అరెస్ట్ ఆరంభమేనన్న టీడీపీ నేత
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిరికి సన్నాసి అని... పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్లినప్పుడు బాత్రూంలో దాక్కున్నాడని తెలిసిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. ఇన్నాళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకొని... విర్రవీగాడని, కానీ ఇప్పుడు బాత్రూంలో దాక్కున్నాడని ఎద్దేవా చేశారు. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి బాత్రూం నుంచి దూకి పారిపోయాడన్నారు. అతనిని కూడా వదిలేది లేదన్నారు. ఎన్నిరోజులు పారిపోతారు... వెంకట్రామిరెడ్డిని ఈడ్చుకొచ్చి కటకటాల వెనక్కి పంపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.

 పిన్నెల్లి సోదరులు జీవితాంతం జైల్లోనే ఉంటారు

బుధవారం ఆయన టీవీ5తో మాట్లాడుతూ... పిన్నెల్లి పాపాలకు లెక్కే లేదన్నారు. రాజారెడ్డి రాజ్యాంగం శాశ్వతం కాదని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు చెప్పారన్నారు. ఎన్డీయే ప్రభుత్వం వారిలా రౌడీయిజం చేయదన్నారు. కానీ పిన్నెల్లి మాత్రం ఈవీఎంలను ధ్వంసం చేశారని ఆరోపించారు. పిన్నెల్లి సోదరులు నరరూప రాక్షసుల్లా ప్రవర్తించారన్నారు. పిన్నెల్లి అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు క్యూ కడుతున్నారని... వారిపై భవిష్యత్తులో వందలాది ఎఫ్ఐఆర్‌లు నమోదైనా ఆశ్చర్యం లేదన్నారు. పిన్నెల్లి సోదరుల చేతిలో బలైన వారు ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారన్నారు. పిన్నెల్లి సోదరులు జీవితకాలమంతా కటకటాల్లోనే ఉంటారని జోస్యం చెప్పారు. వారు బయటకు వచ్చే పరిస్థితి లేదన్నారు. సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని లేదా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి పిన్నెల్లి సోదరుల దౌర్జన్యాలపై ఫిర్యాదు చేయాలని సూచించారు. కేవలం పిన్నెల్లి సోదరులే కాదు... వైసీపీ నేతల అక్రమాలు, దౌర్జన్యాలపై ఫిర్యాదు చేయవచ్చునన్నారు.

పిన్నెల్లి అరెస్ట్ ఆరంభమే...

పిన్నెల్లి అరెస్ట్ ఆరంభమేనని... ఇలాంటి రౌడీ మూకలను జైళ్లకు పంపిస్తామన్నారు. పిన్నెల్లి పాపాలు ఎప్పుడు పండుతాయా? అని ఆయన చేతిలో బలైన వేలాది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయన్నారు. ఆయన కటకటాల వెనక్కి వెళ్లాలని చాలామంది వేచి చూస్తున్నారన్నారు. మాచర్ల నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఆయన చేతిలో బలైనవారు పిన్నెల్లి అరెస్ట్ కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఈరోజు ఎట్టకేలకు బెయిల్ రద్దు కావడంతో అరెస్ట్ అయ్యారన్నారు.


More Telugu News