ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. 2 పాయింట్ల‌తో నెం.1 స్థానం కోల్పోయిన సూర్య‌కుమార్‌

  • ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌కు టీ20 ర్యాంకింగ్స్ లో నెం. 1 స్థానం
  • తాజా ర్యాంకింగ్స్ లో హెడ్‌కు 844 రేటింగ్స్.. సూర్య‌కు 842 రేటింగ్
  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో టాప్‌లోకి దూసుకొచ్చిన ఆసీస్ ఆట‌గాడు
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తాజాగా విడుద‌లైన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో నెం. 1 స్థానం దక్కించుకున్నాడు. ఐసీసీ తాజాగా రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్ లో హెడ్ 844 రేటింగ్స్ తో నాలుగు స్థానాలు ఎగబాకి టాప్ లోకి దూసుకొచ్చాడు. దీంతో సుదీర్ఘ కాలంగా అగ్రస్థానంలో ఉన్న టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యదవ్ రెండో స్థానానికి పడిపోయాడు. కేవ‌లం రెండు పాయింట్ల స్వల్ప తేడాతో సూర్యకుమార్‌ (842 రేటింగ్) నెం.2లో కొనసాగుతున్నాడు. 2023 డిసెంబర్ తర్వాత మొదటిసారి స్టార్ ఇండియన్ బ్యాటర్ సూర్య‌కుమార్ యాద‌వ్ అగ్ర‌స్థానాన్ని కోల్పోవాల్సి వ‌చ్చింది.

ఇక ప్ర‌స్తుతం జ‌రుగుతున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ట్రావిస్ హెడ్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌నే అత‌డిని నెం.1 ర్యాంక్‌లో నిల‌బెట్టింది. అందులోనూ భారత్‌తో జరిగిన ఆస్ట్రేలియా చివరి సూపర్-8 పోరులో హెడ్ కేవలం 43 బంతుల్లోనే 76 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ అత‌ని రేటింగ్స్ పెర‌గ‌డానికి దోహ‌ద‌ప‌డింది. అలాగే టోర్నమెంట్‌ మొత్తం హెడ్ మంచి ప్రదర్శన చేశాడు. అతను ఏడు మ్యాచులలో 42.5 సగటుతో 255 పరుగులు చేశాడు. 200 కంటే ఎక్కువ ర‌న్స్‌ చేసిన బ్యాట‌ర్ల‌లో టోర్నమెంట్ లీడింగ్ స్ట్రయిక్ రేట్ 158.39 అత‌నిదే కావ‌డం గ‌మ‌నార్హం.

కాగా, సూర్య‌కుమార్ ఇప్ప‌టివ‌ర‌కు ఆరు ఇన్నింగ్స్‌ల‌లో క‌లిపి కేవ‌లం 149 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. గురువారం టీమిండియా సెమీస్ ఆడ‌నుంది. ఇందులో సూర్య రాణిస్తే మ‌ళ్లీ నెం.01 ర్యాంక్ ద‌క్కించుకునే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ భార‌త్ సెమీ ఫైన‌ల్‌లో విజ‌యం సాధించి ఫైన‌ల్‌కి వెళ్తే.. ఇంకో ఇన్నింగ్స్ ఆడే అవ‌కాశం సూర్య‌కు వ‌స్తుంది. దాంతో సులువుగా ట్రావిడ్ హెడ్‌ను వెన‌క్కి నెట్టి అగ్ర‌స్థానానికి చేరుకోవ‌చ్చు. 

అటు పాకిస్థాన్ బ్యాట‌ర్ల‌లో బాబర్‌ ఆజం, మహ్మద్‌ రిజ్వాన్‌ ఒక స్థానం కోల్పోయారు. పాక్‌ కెప్టెన్ బాబర్ మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి దిగజారగా, రిజ్వాన్ ఇప్పుడు ఐదో ర్యాంక్‌లో ఉన్నాడు. మ‌రోవైపు టీమిండియా యువ‌ బ్యాటర్ యశస్వీ జైశ్వాల్ (672 రేటింగ్స్) 7వ స్థానంలో ఉన్నాడు. రుతురాజ్ గైక్వాడ్ (616 రేటింగ్స్) 19వ ప్లేస్ లో ఉన్నాడు. ఇక భార‌త కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా 13స్థానాలు మెరుగుపర‌చుకొని (527 రేటింగ్స్) 38వ స్థానానికి చేరాడు.

ఐసీసీ తాజా పురుషుల టీ20 బ్యాటర్ల టాప్‌-5 ర్యాంకింగ్స్
1. ట్రావిస్‌ హెడ్- 844 రేటింగ్స్
2. సూర్యకుమార్‌ యాద‌వ్‌- 842 రేటింగ్స్
3. ఫిల్ సాల్ట్- 816 రేటింగ్స్
4. బాబర్ ఆజం- 755 రేటింగ్స్
5. మహ్మద్ రిజ్వాన్- 746 రేటింగ్స్


More Telugu News