విమానం గాల్లో ఉండగా పైకప్పు తెరుచుకుంటే.. వీడియో ఇదిగో!

  • డచ్ మహిళా పైలట్‌కు భయంకర అనుభవం
  • రెండేళ్ల క్రితం జరిగిన ఘటన
  • తన కథ పైలట్లకు హెచ్చరికగా ఉంటుందనే వెల్లడించానన్న నరైన్
  • ఈ విషయంలో తాను రెండు తప్పులు చేశానన్న పైలట్
పైలట్ మాత్రమే ఉండే విమానం గాల్లో ఉండగా పైకప్పు తెరుచుకుంటే?.. విసురుగా వీస్తున్న గాలి ఊపిరి ఆడనివ్వకుండా చేస్తే?.. ఆ గాలికి కళ్లు పోతాయేమోనని భయం వేస్తే? ఈ భయానక అనుభవాలన్నీ ఓ మహిళా పైలట్‌కు ఎదురయ్యాయి. అయినప్పటికీ ధైర్యం కోల్పోని ఆమె విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. కంటి చూపు తిరిగి సాధారణ స్థితికి రావడానికి ఆమెకు 28 గంటల సమయం పట్టింది. నెదర్లాండ్స్‌కు చెందిన మహిళా పైలట్ నరైన్ మెల్కుమ్జాన్ రెండేళ్ల క్రితం ఎదుర్కొన్న ఈ చేదు అనుభవాన్ని తాజాగా ఎక్స్‌లో పంచుకుంటూ ఆ వీడియోను షేర్ చేశారు.

 ‘‘విమాన విన్యాసాల్లో అది నా రెండో ప్రయాణం. నేను నడుపుతున్న ‘ఎక్స్‌ట్రా 330ఎల్ఎక్స్’ విమానం గాల్లో ఉండగా దాని పైకప్పు తెరుచుకుంది. టేకాఫ్‌కు ముందు సరిగ్గా చెక్ చేసుకోకపోవడమే ఇందుకు కారణం. కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకోండా శిక్షణకు వెళ్లడం కూడా నేను చేసిన మరో తప్పు. కంటికి అద్దాలు లేకపోవడం, ఓ వైపు విమానం నుంచి వచ్చే భారీ శబ్దం, ఇంకోవైపు సరిగా చూడలేని, శ్వాస తీసుకోలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో విమానాన్ని నడపడం సవాలుగా మారింది. అవి నా జీవితంలో భయంకరమైన క్షణాలు. కంటి చూపు విషయంలో కోలుకునేందుకు 28 గంటలు పట్టింది’’ అని ఆమె రాసుకొచ్చారు. పైలట్లకు తన కథ ఒక హెచ్చరికగా ఉండాలనే రెండేళ్ల తర్వాత ఈ విషయాన్ని వెల్లడించినట్టు నరైన్ చెప్పుకొచ్చారు.


More Telugu News