ఆస్కార్ అకాడమీ నుంచి రాజ‌మౌళి దంప‌తులకు అరుదైన ఆహ్వానం!

  • రాజమౌళి, ర‌మా రాజ‌మౌళి, షబానా అజ్మీ, రితేష్ సిధ్వానీల‌కు ఆస్కార్ అకాడ‌మీ స‌భ్య‌త్వ‌ ఆహ్వానం
  • ఆహ్వానం అందుకున్న భార‌తీయ‌ సెల‌బ్రిటీల్లో ర‌వి వ‌ర్మ‌న్‌, రిమా దాస్‌, ప్రేమ్ ర‌క్షిత్
  • అమెరికా కాకుండా 56 దేశాల‌కు చెందిన ప్ర‌ముఖులకు ఆస్కార్ అకాడ‌మీ ఆహ్వానం
అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఇటీవల 487 మంది కొత్త సభ్యులకు ఆహ్వానాలు అందజేసింది. ఇందులో భారతీయ ప్రముఖులైన ఎస్ఎస్‌ రాజమౌళి, ఆయ‌న భార్య‌ ర‌మా రాజ‌మౌళి, షబానా అజ్మీ, రితేష్ సిధ్వానీతో పాటు ఇతరులకు ఆస్కార్ అవార్డులు అంద‌జేసే అకాడ‌మీలో స‌భ్య‌త్వ ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానితుల్లో 71 మంది ఆస్కార్ నామినీలు, మ‌రో 19 మంది ఆస్కార్ విజేత‌లు కూడా ఉన్నారు. 

కాగా, ఆస్కార్ అకాడ‌మీ ఆహ్వానం అందుకున్న సెల‌బ్రిటీల్లో సినిమాటోగ్రాఫ‌ర్ ర‌వి వ‌ర్మ‌న్‌, ఫిల్మ్‌మేక‌ర్ రిమా దాస్‌, నాటు నాటు సాంగ్ కొరియోగ్రాఫ‌ర్ ప్రేమ్ ర‌క్షిత్ కూడా ఉన్నారు. అహ్వానం అందిన ప్ర‌తి ఒక్క‌రూ ఆ క‌మిటీలో చేరితే అప్పుడు మొత్తం స‌భ్యుల సంఖ్య 10, 910కి చేరుతుంది. ఇందులో సుమారు 9 వేల మంది ఆస్కార్ వేడుక‌ల స‌మ‌యంలో ఓటు వేయడానికి అర్హులు.

ఇక అకాడ‌మీ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ ప్ర‌కారం..  2024 ఆహ్వాన జాబితాలో 44 శాతం మ‌హిళ‌లు, 41 శాతం ఎథ్నిక్ క‌మ్యూనిటీలు ఉన్న‌ట్లు ఉన్నారు. యూఎస్‌ కాకుండా 56 దేశాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఆహ్వానం అందుకున్న‌ట్లు తెలుస్తోంది. 

ఈ సంద‌ర్భంగా అకాడ‌మీ సీఈఓ బిల్ క్రామిర్‌, అధ్య‌క్షుడు జానెత్ యాంగ్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. "ఈ సంవత్సరం అకాడమీకి కొత్త సభ్యులను స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ప్ర‌పంచ‌దేశాల‌కు చెందిన అసాధారణ ప్రతిభావంతులైన కళాకారులు, నిపుణులు మా చిత్రనిర్మాణ రంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపారు. అలాంటి వారిని ఆహ్వానించ‌డం ఆనందంగా ఉంది" అని వారు పేర్కొన్నారు. ఇక బహుళ శాఖలలో ఆహ్వానం అందిన వ్య‌క్తులు స‌భ్య‌త్వం కోసం ఏదో ఒక శాఖ‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది.


More Telugu News