భారత్‌తో సత్సంబంధాలకు పాక్ సంకేతాలు

  • శాశ్వత శత్రుత్వాన్ని పాక్ విశ్వసించబోదన్న ఆ దేశ డిప్యూటీ  పీఎం
  • భారత్‌లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తుందని ఇషాక్ దార్ ఆశాభావం
  • అంతమాత్రాన ఏకపక్ష, ఆధిపత్య విధానాలను అంగీకరించబోమని స్పష్టీకరణ
చూస్తుంటే భారత్ విషయంలో పాకిస్థాన్ క్రమంగా తన వైఖరిని మార్చుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇండియా పేరు వింటేనే కుతకుత ఉడికిపోయే పాక్ ఇప్పుడు సత్సంబంధాలకు సిద్ధమంటూ సంకేతాలు పంపిస్తోంది. భారత్‌తో శాశ్వత శత్రుత్వాన్ని పాకిస్థాన్ కోరుకోవడం లేదని, దాయాది దేశంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తుందన్న ఆశాభావాన్ని పాకిస్థాన్ డిప్యూటీ ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ వ్యక్తం చేశారు. ఇస్లామాబాద్‌తో సంబంధాల పునరుద్ధరణ విషయంలో భారత్ హుందాగా వ్యవహరిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు.

ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ ఇస్లామాబాద్‌ (ఐఎస్ఐఎస్)లో మంగళవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశాలతో పాకిస్థాన్ ఎప్పుడూ మంచి సంబంధాలనే కోరుకుంటుందని 74 ఏళ్ల ఇషాక్ దార్ పేర్కొన్నారు.

‘‘తూర్పున ఉన్న భారతదేశంతో సంబంధాలు చారిత్రక సమస్యగా మారాయి. పాకిస్థాన్ శాశ్వత శత్రుత్వాన్ని ఎన్నడూ విశ్వసించదు. పరస్పర గౌరవం, సార్వభౌమ సమానత్వం, జమ్మూకశ్మీర్‌పై దీర్ఘకాలంగా ఉన్న వివాదానికి న్యాయమైన, శాంతియుత పరిష్కారం ఆధారంగా భారత్‌తో మంచి సంబంధాలు కోరుకుంటున్నాం’’ అని చెప్పుకొచ్చారు. నిర్మాణాత్మక చర్చలను పాకిస్థాన్ కోరుకుంటోందని, అంతమాత్రాన ఏకపక్ష, భారత్ ఆధిపత్య విధానాలను మాత్రం పాకిస్థాన్ ఎప్పటికీ అంగీకరించబోదని దార్ తేల్చి చెప్పారు.


More Telugu News