ఎంపీగా రాహుల్ గాంధీ ప్రమాణం

  • లోక్ సభకు వచ్చిన సోనియా, ప్రియాంకగాంధీ
  • ప్రమాణం చివరలో జైహింద్, జై సంవిధాన్ అని రాహుల్ గాంధీ నినాదాలు
  • వయనాడ్ స్థానానికి రాహుల్ రాజీనామాను ఆమోదించిన స్పీకర్
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఆయన చేత ప్రమాణం చేయించారు. రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారాన్ని చూసేందుకు తల్లి సోనియాగాంధీ, సోదరి ప్రియాంకగాంధీ హాజరయ్యారు. రాహుల్ గాంధీ ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు. చివరలో జైహింద్, జై సంవిధాన్ అని నినదించారు. చిన్న రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పట్టుకొని ఆయన ప్రమాణం పూర్తి చేశారు. ప్రమాణం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ సభ్యులు భారత్ జోడో అంటూ నినాదాలు చేశారు.

సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి, కేరళలోని వయనాడ్... రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో విజయం సాధించారు. అయితే, ఆయన వయనాడ్‌ను వదులుకొని రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. కేరళలోని వయనాడ్ స్థానానికి ఆయన చేసిన రాజీనామాను స్పీకర్ సోమవారం ఆమోదించారు.

ఈరోజుతో ఎంపీల ప్రమాణ స్వీకారం పూర్తి కానుంది. బుధవారం స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ పదవికి ఎన్డీయే అభ్యర్థిగా బీజేపీ ఎంపీ ఓం బిర్లా, ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ సురేశ్ పోటీ పడుతున్నారు. నామినేషన్ ఉపసంహరించుకోవడానికి ఈ రోజు సాయంత్రం వరకు గడువు ఉంది.


More Telugu News