లోక్ సభ స్పీకర్ గా మళ్లీ ఓం బిర్లా..!

  • నామినేషన్ దాఖలు చేయనున్న బీజేపీ లీడర్
  • స్పీకర్ బరిలో ఇండియా కూటమి అభ్యర్థి కూడా
  • పోటీ ఉన్నప్పటికీ ఓం బిర్లా సునాయాసంగా గెలిచే అవకాశం
కేంద్రంలో ఎన్డీఏ కూటమి సర్కారు ప్రభుత్వం ఏర్పడడంతో లోక్ సభ స్పీకర్ ఎంపికపై సస్పెన్స్ నెలకొంది. కూటమిలో కీలకంగా మారిన జేడీయూ, టీడీపీలు స్పీకర్ పోస్ట్ కోసం పట్టుబడుతున్నాయని ప్రచారం జరిగింది. దీంతో స్పీకర్ అభ్యర్థి ఎంపికపై బీజేపీ పెద్దలు ఆచితూచి వ్యవహరించారు. ఈ క్రమంలో 18వ లోక్ సభకు స్పీకర్ గా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

ఇన్నాళ్లూ ఈ విషయంలో నెలకొన్న సస్పెన్స్ తాజాగా వీడింది. లోక్ సభ స్పీకర్ పదవికి మరోమారు ఓం బిర్లాను బీజేపీ ఎంపిక చేసినట్లు సమాచారం. మరికాసేపట్లో ఓం బిర్లా స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. మరోపక్క, స్పీకర్ పదవికి ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా పోటీ పడనుందని రాజకీయ వర్గాల అంచనా. అయితే, సభలో సంఖ్యా బలంతో ఎన్డీయే తన అభ్యర్థిని సునాయాసంగా గెలిపించుకుంటుందనే చెప్పాలి.  

సభలోని ఎంపీల సాధారణ మెజారిటీతో స్పీకర్ ను ఎన్నుకుంటారు. కాగా, 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ రెండు సందర్భాలలో బీజేపీకి సొంతంగా మెజారిటీ రావడంతో స్పీకర్ ఎన్నికపై ఎలాంటి అడ్డంకులు ఎదురుకాలేదు. 2014లో సుమిత్రా మహాజన్, 2019లో ఓం బిర్లాలతో స్పీకర్ పోస్టుకు నామినేషన్ వేయించి బీజేపీ గెలిపించుకుంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో ఎన్డీఏ కూటమిలోని నితీశ్, చంద్రబాబు కీలకంగా మారారు. ఈ క్రమంలోనే స్పీకర్ ఎంపికపై కూటమిలో తర్జనభర్జన జరిగినట్లు తెలుస్తోంది.


More Telugu News