జగన్‌రెడ్డీ.. నీ ముందు కిమ్ కూడా దిగదుడుపే: గంటా శ్రీనివాస్

  • జిల్లాల్లో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాలను ఉద్దేశించి గంటా పోస్ట్
  • కిమ్ కూడా జగన్ అంత విలాసంగా జీవించి ఉండరని ఎద్దేవా
  • 986 మందితో భద్రతా ఏర్పాట్లు దేనికోసమని ప్రశ్న
  • 30 అడుగుల ఎత్తున ఐరన్ వాల్ ఏర్పాటు చేసుకుని మళ్లీ భద్రత ఎందుకని నిలదీత
  • ఇంత అభద్రత మధ్య ఎందుకు జీవించాల్సి వచ్చిందో ఆ పెరుమాళ్లకే ఎరుకని ఎద్దేవా
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లాల్లో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాలను ఉద్దేశించి తాజాగా ఆయన ఎక్స్‌లో స్పందించారు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కూడా జగన్ అంత విలాసవంతమైన జీవితం గడిపి ఉండరని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్‌పై పలు ప్రశ్నలతో విరుచుకుపడ్డారు.

దేశంలో ఎవరికీ లేని స్థాయిలో సెక్యూరిటీ ఎందుకు పెట్టుకున్నారని జగన్‌ను ప్రశ్నించారు. చివరికి ప్రధానమంత్రి, రాష్ట్రపతికి మించిన స్థాయిలో జగన్ తన ప్యాలెస్‌ల వద్ద వందలమందితో భద్రతా వలయం ఏర్పాటు చేసుకున్నారని ధ్వజమెత్తారు.  ప్యాలెస్‌ల వద్ద 986 మందితో నిరంతర భద్రతా ఏర్పాటు దేనికోసమని ప్రశ్నించారు. 

తాడేపల్లి ప్యాలెస్ వద్ద స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ నుంచి 379 మంది, ఇతర విభాగాల నుంచి 439 మంది, అలైడ్ విధుల కోసం 116 మంది కలిపి 934 మందితో భద్రత ఎందుకు ఏర్పాటు చేసుకున్నట్టని నిలదీశారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ ప్యాలెస్ వద్ద 9 మంది, ఇడుపులపాయ ప్యాలెస్ వద్ద 33 మంది, పులివెందుల నివాసం వద్ద 10 మందితో భద్రత ఎందుకని నిలదీశారు. 

తాడేపల్లి ప్యాలెస్ చుట్టుపక్కల 48 చోట్ల చెక్ పోస్టులు, అవుట్ పోస్టులు, పోలీస్ పికెట్లు, బ్యారికేడ్లు, 439 మందితో ప్యాలస్ నలుమూలల అడుగుకో పోలీస్ పోస్ట్, చెక్ పోస్ట్, బూమ్ బారియర్లతో భద్రత ఎందుకోసమని జగన్‌ను ప్రశ్నించారు. జగన్ భద్రత కోసం 24 గంటలూ అందుబాటులో ఉండేలా సమీపంలోని నివాసాల పై డ్రోన్ల తో పర్యవేక్షణ ఎందుకోసమని ప్రశ్నించారు. 

 30 అడుగుల ఎత్తున ఐరన్ వాల్ ఏర్పాటు చేసుకున్న ప్యాలస్‌కు ఇద్దరు డీఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులతో నిరంతరం భద్రతా పర్యవేక్షణ ఎందుకోసమని నిలదీశారు. జెడ్‌ప్లస్ క్యాటగిరీలో ఉన్న చంద్రబాబు సైతం ఏనాడూ ఈ స్థాయి భద్రతను ఏర్పాటు చేసుకోలేదని పోలీసులే చెవులు కొరుక్కుంటున్నారని పేర్కొంటున్నారు. ఇలాంటి వింత పోకడలు, ఇలాంటి అభద్రతా భయాల మధ్య జగన్ ఎందుకు గడపాల్సి వచ్చిందో పెరుమాళ్లకే ఎరుకని గంటా శ్రీనివాసరావు తన పోస్టులో పేర్కొన్నారు.


More Telugu News