17 ఏళ్లుగా అలాగే ఉన్న యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ

  • ఒక ఎడిషన్ టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా అవతరణ
  • ప్రస్తుత వరల్డ్ కప్ మొత్తం 13 సిక్సర్లు బాదిన హిట్‌మ్యాన్
  • 2007 టీ20 వరల్డ్ కప్‌లో 12 సిక్సర్లు కొట్టిన యువరాజ్ సింగ్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి అదరగొట్టాడు. టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. డారెన్ సామీ నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 41 బంతుల్లోనే 92 పరుగులు బాదాడు. తన కెరియర్‌లోనే బెస్ట్ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచిపోయేలా హిట్‌మ్యాన్ ఆడాడు. తన ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. భారత్ 205 పరుగుల భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో సిక్సర్ల సునామీ సృష్టించిన రోహిత్ శర్మ సంచలన రికార్డు సృష్టించాడు.

ఆసీస్‌పై 8 సిక్సర్లు బాదడంతో ప్రస్తుత టీ20 ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ సిక్సర్ల సంఖ్య 13కు చేరింది. ఒక టీ20 వరల్డ్ కప్‌లో ఏ భారతీయ ఆటగాడికైనా ఇవే అత్యధిక సిక్సర్లుగా ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్ ఆరంభ ఎడిషన్ 2007లో యువరాజ్ సింగ్ 12 సిక్సర్లు బాదాడు. ఆ రికార్డును రోహిత్ ప్రస్తుత టోర్నీలో అధిగమించాడు. కాగా2007 టోర్నీలో యువరాజ్ 12 సిక్సర్లు బాదగా అందులో 6 సిక్సర్లు ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌ వేసిన ఒకే ఓవర్‌లో రావడం విశేషం. 

మరోవైపు ఒక టీ20 ప్రపంచకప్‌లో ఒకే మ్యాచ‌లో అత్యధిక సిక్సర్లు-8 బాదిన ఆటగాడిగాన రోహిత్ శర్మ నిలిచాడు. 2007లో ఇంగ్లండ్‌పై యువరాజ్ 7 సిక్సర్లు బాదాడు. ఆ రికార్డును కూడా రోహిత్ శర్మ చెరిపివేశాడు.

టీ20 వరల్డ్ కప్‌లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్లు
1. రోహిత్ శర్మ - 13 సిక్సర్లు (2024 - 6 మ్యాచ్‌లు)
2. యువరాజ్ సింగ్ - 12 (2007 - 5 మ్యాచ్‌లు)
3. విరాట్ కోహ్లీ - 10 సిక్సర్లు (2014 - 6 మ్యాచ్‌లు)
4. యువరాజ్ సింగ్ - 9 సిక్సర్లు (2009 - 5 మ్యాచ్‌లు)
5. సూర్యకుమార్ యాదవ్ - 9 సిక్సర్లు (2022 - మ్యాచ్‌లు)

బాబర్ రికార్డు కూడా బద్దలు
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ రోహిత్ శర్మ నిలిచారు. మొత్తం 4,165 పరుగులతో బాబర్ అజామ్‌ను అధిగమించి నంబర్ వన్ స్థానంలో నిలిచాడు. ఆసీస్‌పై 92 పరుగుల ద్వారా రోహిత్ ఈ రికార్డు సృష్టించాడు.


More Telugu News