జుబ్లీహిల్స్‌లో ఇలాంటి ప్రకటన చేయగలరా?: 'నో ఫ్రెండ్లీ.. లాఠీఛార్జ్ పోలీస్'పై అసదుద్దీన్ ఆగ్రహం

  • మెట్రో నగరాల్లో రాత్రి 12 వరకు దుకాణాలు తెరిచి ఉంటాయన్న అసదుద్దీన్
  • పాతబస్తీలోనూ అనుమతించాలని డిమాండ్
  • అందరికీ ఒకే రూల్ ఉంటుందని గుర్తుంచుకోవాలని వ్యాఖ్య
రాత్రి పదకొండు తర్వాత నో ఫ్రెండ్లీ పోలీస్... లాఠీఛార్జ్ పోలీస్ అంటూ హైదరాబాద్ పోలీసులు చేసిన ప్రకటనపై మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి పదిన్నర తర్వాత వ్యాపార సముదాయాలు మూసివేయాలని పోలీసులు ప్రకటించారు. నగరంలో హత్యలు, అత్యాచార ఘటనల నేపథ్యంలో పోలీసులు ఈ ప్రకటన చేసినట్లుగా చెబుతున్నారు. ఈ ఘటనపై అసదుద్దీన్ స్పందించారు.

పాతబస్తీలోనే ఇలాంటి ప్రకటనలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి ప్రకటనలే జుబ్లీహిల్స్‌లో చేయగలరా? అని నిలదీశారు. మెట్రో నగరాల్లో, జుబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలు రాత్రి 12 గంటల వరకు అనుమతిస్తారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లోనూ అనుమతించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఆర్థిక వ్యవస్థ చాలా వరకు దెబ్బతిందన్నారు. అలాంటప్పుడు రాత్రి వ్యాపారాలకు అనుమతిస్తే తప్పేమిటన్నారు. అందరికీ ఒకే రూల్ ఉంటుందని గుర్తుంచుకోవాలన్నారు. పాతబస్తీతో పాటు జుబ్లీహిల్స్‌లోనూ రాత్రివేళల్లో చాయ్ హోటల్స్, పాన్ షాపులు తెరిచి ఉంటాయన్నారు.


More Telugu News