రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి: శ్రీశైలంలో తెలంగాణ డిప్యూటీ సీఎం

  • శ్రీశైల మల్లికార్జునస్వామి వారిని దర్శించుకున్న భట్టివిక్రమార్క
  • ఇరురాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని దేవుడిని కోరుకున్నట్లు వెల్లడి
  • తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తికి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని తాను స్వామివారిని మొక్కుకున్నానని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. సోమవారం ఆయన కుటుంబసభ్యులు, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్, మెగారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి శ్రీశైల మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఇరురాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రుతుపవనాలు బలంగా వీచాలని... పంటలు బాగా పండాలని... వర్షాలు పడాలని కోరుకున్నట్లు చెప్పరు. తెలుగువారందరి జీవితాల్లో వెలుగులు నిండాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున దేవుడిని కోరుకున్నానన్నారు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి జీవితాల్లో వెలుగులు నింపాలని... మంచిపేరు తీసుకురావాలని మల్లికార్జున, భ్రమరాంబిక అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నానన్నారు.

విద్యుత్ ఉత్పత్తికి కొరత లేకుండా చర్యలు

తెలంగాణలో 2029-30 వరకు విద్యుత్ కొరత లేకుండా చర్యలు చేపడుతున్నట్లు భట్టివిక్రమార్క చెప్పారు. రుతుపవనాలు రాకముందే శ్రీశైలం హైడల్ ప్రాజెక్టును సమీక్షించి తద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన చర్యలు చేపట్టడమే తన పర్యటన ఉద్దేశం అన్నారు. నాటి కాంగ్రెస్ పెద్దల ముందుచూపుతో నిర్మించిన బహుళార్థక సాధక ప్రాజెక్టులతో మన జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. శ్రీశైలం హైడల్ ప్రాజెక్టు ద్వారా అత్యధికస్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణలో రెప్పపాటు కూడా కరెంట్ కోత లేదన్నారు.


More Telugu News