శుభ్‌మ‌న్ గిల్‌కు టీమిండియా కెప్టెన్సీ..!

  • జింబాబ్వేతో 5 మ్యాచుల టీ20 సిరీస్
  • టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ముగిసిన త‌ర్వాత‌ ఈ ప‌ర్య‌ట‌న కోసం జింబాబ్వే వెళ్ల‌నున్న టీమిండియా
  • సీనియ‌ర్ల‌కు విశ్రాంతి.. గిల్‌కు భార‌త జ‌ట్టు కెప్టెన్సీ అప్ప‌గించే యోచ‌న‌లో బీసీసీఐ
  • జులై 6 నుంచి 14 వరకు సిరీస్
ప్ర‌స్తుతం అమెరికా, వెస్టిండీస్ వేదిక‌గా జ‌రుగుతున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమిండియా ఆట‌గాళ్లు బిజీగా ఉన్నారు. అయితే, ఈ ఐసీసీ మెగా టోర్నీ ముగిసిన త‌ర్వాత భార‌త జ‌ట్టు జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. జింబాబ్వేతో 5 మ్యాచుల టీ20 సిరీస్ ఆడ‌నుంది. ఈ పర్యటన కోసం జట్టును ఎంపిక చేయడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కసరత్తు చేస్తోంది. జులై 6న ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. 

అయితే, ఈ టూర్‌కు రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి అనుభవజ్ఞులకు విశ్రాంతి ఇవ్వాల‌ని బోర్డు నిర్ణ‌యించింది. అలాగే హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వంటి వారు కూడా జట్టుతో కలిసి జింబాబ్వేకు వెళ్లే ప్రతిపాదనను తిరస్కరించిన‌ట్లు స‌మాచారం.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ నివేదిక ప్రకారం రోహిత్, హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్‌ లేకపోవడంతో యువ ఆట‌గాడు శుభ్‌మ‌న్ గిల్‌కు బీసీసీఐ మంచి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జట్టుకు గిల్‌ను సార‌ధిగా నియమించే అవ‌కాశం ఉన్నట్లు సమాచారం. 

ఇక ఈ జట్టులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) స్టార్లు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, నితీశ్‌ కుమార్ రెడ్డి, తుషార్ దేశ్‌పాండే, హర్షిత్ రాణాకు చోటు క‌ల్పించ‌నుంది. అలాగే టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టుతో పాటు ఉన్న సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, రింకూ సింగ్ వంటి వారు కూడా జ‌ట్టులో ఉంటార‌ని తెలిసింది.

ఈ క్రమంలో యంగ్ టీమ్ సారథ్య బాధ్యతలను గిల్‌కు అప్పగించాలని మేనేజ్మెంట్ ఆలోచిస్తోందట. అందుకే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో రిజ‌ర్వ్ ప్లేయ‌ర్‌గా అమెరికాలో ఉన్న గిల్‌ను స్వదేశం రప్పించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ పర్యటనకు వెళ్లనున్న జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ జట్టులో దాదాపు కుర్రాళ్లకే ఛాన్స్ దక్కే అవ‌కాశం ఉంది. కాగా, జులై 6 నుంచి 14 వరకు ఈ సిరీస్ జరగనుంది.

కాగా, భారత కొత్త హెడ్‌ కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియామకంపై సస్పెన్స్ ఇంకా ముగియకపోవడంతో నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్‌గా ఉన్న‌ వీవీఎస్‌ లక్ష్మణ్  జట్టుకు ప్ర‌ధాన కోచ్‌గా ఉండనున్నారు. అలాగే మరికొందరు ఎన్‌సీఏ కోచ్‌లతో కలిసి ఆయ‌న‌ జింబాబ్వేకు వెళ్లనున్నారు. ఇక తదుపరి భారత జ‌ట్టు ప్ర‌ధాన కోచ్‌గా గంభీర్ జులై 27న ప్రారంభమయ్యే శ్రీలంక పర్యటనలో జట్టులో చేరే అవకాశం ఉంది.

జింబాబ్వే టీ20 సిరీస్‌కు భారత జట్టు (అంచ‌నా): శుభమన్ గిల్ (కెప్టెన్‌), రుతురాజ్ గైక్వాడ్ , రింకూ సింగ్, సంజు శాంసన్ ( వికెట్ కీప‌ర్‌ ), అభిషేక్ శర్మ, నితీశ్‌ రెడ్డి, హర్షిత్ రాణా, యశ్ దయాల్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, రియాన్ పరాగ్, రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌).


More Telugu News