అప్పుడు, బీఆర్ఎస్ మా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోలేదా?: షబ్బీర్ అలీ

  • ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్లు మా పార్టీలో చేరితే ఎందుకు తప్పుబడుతున్నారని నిలదీత
  • భట్టివిక్రమార్కకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని ఆగ్రహం
  • 11 ఎకరాల్లో ఉన్న బీఆర్ఎస్ కార్యాలయ భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్
  • కోకాపేటలో బీఆర్ఎస్‌కు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకొని వేలం వేయాలని సూచన
గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బీఆర్ఎస్‌లో చేర్చుకోలేదా? ఇప్పుడు మా పార్టీలో చేరితే ఎందుకు తప్పుబడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీ ప్రజాప్రతినిధులను చేర్చుకొని... భట్టివిక్రమార్కకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన మండలిలో తనకూ ప్రతిపక్ష హోదాను తొలగించారని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం 11 ఎకరాలు ఎందుకో చెప్పాలని నిలదీశారు. కార్యాలయం ఉన్న భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కోకాపేటలో బీఆర్ఎస్‌కు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకొని వేలం వేయాలని సూచించారు. వేలం ద్వారా వచ్చిన డబ్బులను రైతు రుణమాఫీకి ఉపయోగించాలన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పని ఖతమైందన్నారు.


More Telugu News