మంత్రిగా లోకేశ్ తొలి సంతకం దేనిపైనంటే..!

  • 16 వేల పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు ఆమోదం
  • విద్యా శాఖ మంత్రిగా మెగా డీఎస్సీ ఫైలుపై సంతకం చేసిన లోకేశ్
  • ఆర్భాటాలు వద్దంటూ తన కుర్చీకి చుట్టిన టవల్ తీసేసిన మంత్రి
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య, ఆర్టీజీ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్ తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపై చేశారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో రూం నంబర్ 208 లో లోకేశ్ ఛాంబర్ ఏర్పాటు చేశారు. తన ఛాంబర్ లో ఎలాంటి ఆర్భాటాలు వద్దంటూ మంత్రి లోకేశ్ తన కుర్చీకి చుట్టిన టవల్ ను తీసేశారు. ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టాక మెగా డీఎస్సీకి ఆమోదం తెలుపుతూ సంబంధిత ఫైలుపై సంతకం చేశారు. మెగా డీఎస్సీ కింద 16347 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ సీఎం చంద్రబాబు సంతకం చేసిన విషయం తెలిసిందే.

విద్యాశాఖ మంత్రిగా లోకేశ్ కూడా అదే ఫైలుపై తొలి సంతకం చేశారు. అంతకుముందు సచివాలయంలో మంత్రి లోకేశ్ కు అధికారులు ఘన స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన మంత్రి లోకేశ్ కు సహచర మంత్రులు నిమ్మల రామానాయుడు, రాంప్రసాద్ రెడ్డి, సవిత, గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, మాజీ ఎంపీ కనకమేడల, పార్టీ ఎమ్మెల్యేలు తదితరులు అభినందనలు తెలిపారు.


More Telugu News