ఉత్కంఠ పోరులో విండీస్‌పై ద‌క్షిణాఫ్రికా విజయం.. సెమీస్‌కు స‌ఫారీలు!

  • వెస్టిండీస్‌, ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య‌ సూప‌ర్‌-8 మ్యాచ్‌
  • డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తిలో విండీస్‌పై 3 వికెట్ల తేడాతో ద‌క్షిణాఫ్రికా విజ‌యం
  • ఈ విజ‌యంతో సెమీ ఫైన‌ల్ చేరిన సౌతాఫ్రికా.. ఇంటిముఖం ప‌ట్టిన ఆతిథ్య జ‌ట్టు
  • గ్రూప్‌-2 నుంచి ఇప్ప‌టికే ఇంగ్లండ్‌కు సెమీస్ బెర్త్ క‌న్ఫార్మ్
టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సూప‌ర్‌-8 మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌పై ద‌క్షిణాఫ్రికా విజ‌యం సాధించింది. డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తిలో 17 ఓవ‌ర్ల‌లో 123 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించిన స‌ఫారీలు సెమీస్‌కు దూసుకెళ్లారు. సౌతాఫ్రికా టాస్ గెలిచి, క‌రేబియ‌న్ జ‌ట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే, త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో క‌రేబియ‌న్ బ్యాట‌ర్లు చేతులెత్తేశారు. దాంతో ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్లలో 8 వికెట్లు కోల్పోయి 135 ర‌న్స్‌కే ప‌రిమిత‌మైంది. రోస్ట‌ర్ చేజ్ అర్ధ‌శ‌త‌కం (52) తో ఒంట‌రి పోరాటం చేశాడు. ఓపెన‌ర్ కైల్ మేయ‌ర్స్ 35 ప‌రుగుల‌తో ఫ‌ర్వాలేద‌నిపించాడు. స‌ఫారీ బౌల‌ర్ల‌లో షంసీ 3 వికెట్లు తీసి విండీస్‌ను దెబ్బ‌తీశాడు. అలాగే జాన్‌సెన్‌, మార్క్‌ర‌మ్‌, ర‌బాడ‌, కేశవ్ మ‌హ‌రాజ్ త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు. 

అనంత‌రం 136 ప‌రుగుల విజయ ల‌క్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన స‌ఫారీలు 2 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 15 ప‌రుగుల‌కే 2 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో పడ్డారు. ఈ క్ర‌మంలోనే వ‌ర్షం రావ‌డంతో మ్యాచ్‌ను 17 ఓవ‌ర్ల‌కు కుదించారు. అలాగే ద‌క్షిణాఫ్రికా టార్గెట్‌ను 123గా నిర్ణ‌యించారు. వ‌ర్షం త‌ర్వాత మ్యాచ్ ప్రారంభ‌మైన కొద్దిసేప‌టికే కెప్టెన్ మార్క్‌ర‌మ్ (18) త‌న వికెట్ పారేసుకున్నాడు.  

ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన క్లాసెన్ (22), స్ట‌బ్స్ (29) కొద్దిసేపు విండీస్ బౌల‌ర్ల‌ను నిలువ‌రించారు. ఈ జోడీ 35 ప‌రుగుల భాగ‌స్వామ్యం అందించింది. క్రీజులో కుదురుకున్న‌ట్లు క‌నిపించిన క్లాసెన్ ఔట్ కావ‌డం, ఆ వెంట‌నే డేవిడ్ మిల్ల‌ర్ (4) కూడా పెవిలియ‌న్ చేర‌డంతో స‌ఫారీల క‌ష్టాలు మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చాయి. 100 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్పోయిన ద‌శ‌లో లోయ‌ర్ ఆర్డ‌ర్ ఆట‌గాడు జాన్‌సెన్ బ్యాట్ ఝుళిపించ‌డంతో ద‌క్షిణాఫ్రికా గ‌ట్టేక్కింది. 

ఆఖ‌రి ఓవ‌ర్‌లో 5 ప‌రుగులు కావాల్సి ఉండ‌గా.. మెక్‌కీ వేసిన తొలి బంతికే జాన్‌సెన్ సిక్స‌ర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. 3 వికెట్ల తేడాతో ద‌క్షిణాఫ్రికా విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో స‌ఫారీలు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లారు. 3 వికెట్లు తీసి విండీస్ ఇన్నింగ్స్‌ను కుప్ప‌కూల్చిన స్పిన్న‌ర్‌ షంసీకి 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు ద‌క్కింది. 

ఇక గ్రూప్‌-2 నుంచి ఇప్ప‌టికే ఇంగ్లండ్ సెమీస్ బెర్త్ క‌న్ఫార్మ్ చేసుకోగా, ఇప్పుడు రెండో జ‌ట్టుగా ద‌క్షిణాఫ్రికా నిలిచింది. మూడో స్థానంలో ఉన్న ఆతిథ్య‌ కరేబియ‌న్ జ‌ట్టు, నాలుగో స్థానంలో ఉన్న మ‌రో కో-హోస్ట్‌ అమెరికా ఇంటిదారి ప‌ట్టాయి.


More Telugu News