ఓఆర్‌ఆర్‌పై బస్సు బోల్తా.. మహిళ దుర్మరణం

  • నార్సింగి వద్ద ఆదివారం రాత్రి ప్రమాదం
  • మద్యం మత్తులో అతివేగంతో బస్సును నడిపిన డ్రైవర్
  • వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడ్డ వైనం
  • బస్సు కింద పడి ఓ ప్రయాణికురాలి దుర్మరణం, 15 మందికి గాయాలు
హైదరాబాద్‌లో డ్రైవర్ మద్యం మత్తు కారణంగా ఆదివారం రాత్రి ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, 15 మంది గాయాలపాలయ్యారు. నార్సింగి వద్ద ఓఆర్ఆర్‌పై ఈ ప్రమాదం సంభవించింది. గాయపడ్డ వారిని చికిత్స కోసం నానక్‌రాంగూడలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. మృతురాలిని ఒంగోలుకు చెందిన మమత (33)గా గుర్తించారు. 

ప్రమాదం ఇలా..
హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళ్లాల్సిన మార్నింగ్ స్టార్ ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు గచ్చిబౌలి నుంచి బయలుదేరిన 15 నిమిషాలకే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదసమయంలో బస్సులో 18 మంది ఉన్నారు. నార్సింగి అలేఖ్య రైజ్ టవర్స్ సమీపంలో ఓఆర్ఆర్ మీదుగా 150 కి.మీ వేగంతో వెళుతూ మలుపు తిరగడంతో బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో  డివైడర్ దాటి పక్క రహదారిపై బోల్తా పడింది. కిటీకీ అద్దాలు పగిలి ఓ మహిళ కింద పడింది. ఆమెపై బస్సు పడటంతో దుర్మరణం చెందింది. మిగతా ప్రయాణికులకు తలకు, చేతులకు గాయాలయ్యాయి. ఘటనాస్థలిని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ పరిశీలించారు. మరోవైపు, ప్రమాదం కారణంగా అప్పా కూడలి నుంచి గచ్చిబౌలి వెళ్లాల్సిన వాహనాలను కొన్ని గంటలసేపు దారి మళ్లించారు.


More Telugu News