ఈ విషయం నాకు నిన్న తెలిసింది... ఆ మూడు చానళ్లపై నిషేధం ఎత్తివేశాను: స్పీకర్ అయ్యన్న

  • గత ప్రభుత్వంలో ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 చానళ్లపై నిషేధం
  • అసెంబ్లీ ప్రసారాల కవరేజీ ఇవ్వకుండా నిషేధం
  • నేడు ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఎన్నిక
  • చానళ్లపై నిషేధం ఎత్తివేత ఫైలుపై తొలి సంతకం చేశానన్న అయ్యన్న
ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు అందుకున్న అయ్యన్నపాత్రుడు మూడు చానళ్లపై నిషేధం ఎత్తివేత ఫైలు మీద తొలి సంతకం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 చానళ్లను అసెంబ్లీ లైవ్ కవరేజీ ఇవ్వకుండా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 

ఇవాళ అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తన చాంబర్ కు వచ్చిన అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడారు. ఆ మూడు చానళ్లపై ఇంకా నిషేధం కొనసాగుతున్న విషయం తనకు నిన్ననే తెలిసిందని వెల్లడించారు. అందుకే, ఇవాళ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే... ఆ మూడు చానళ్లపై నిషేధం ఎత్తివేస్తూ సంతకం చేశానని తెలిపారు. 

"టీవీ చానళ్లలో రకరకాలు ఉంటాయి. వార్తా చానళ్లకు వాటి విలువ వాటికి ఇవ్వాలి. టీవీ చానళ్లకు పార్లమెంటులోనూ ఇస్తారు, ఎక్కడైనా ఇస్తారు. అలాంటిది... టీవీ5, ఈనాడు, ఆంధ్రజ్యోతి చానళ్ల మీదే నిషేధం ఎందుకు? వాటిపై ఇంకా నిషేధం ఎత్తివేయలేదన్న సంగతి నిన్న తెలియడంతో అందరం కూర్చుని చర్చించాం. అలాగని ఇతర చానళ్లను కక్షసాధింపు ధోరణితో చూడం. మాకు అన్ని చానళ్లు సమానమే. అందరినీ ఒకే దృష్టితో చూస్తాం. ఆ గౌరవాన్ని అందుకుంటే అందుకుంటారు... లేకపోతే పోతారు" అంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.


More Telugu News