సింగరేణిని రక్షించాల్సిన బాధ్యత కేంద్రానిది... కార్మికుల కష్టాలు నాకు తెలుసు: కిషన్ రెడ్డి

  • సింగరేణిలో కేంద్రానికి 49 శాతం వాటా ఉందని వెల్లడి
  • సింగరేణి అంశాన్ని రాజకీయం కోసం ఉపయోగించుకుంటున్నారని విమర్శ
  • ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచన
సింగరేణిని రక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సింగరేణి కార్మికుల కష్టాలు తనకు తెలుసునన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉందని గుర్తు చేశారు. దీనిని కాపాడే బాధ్యత కేంద్రానికీ ఉందన్నారు. సింగరేణి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం, విపక్షాలు రాజకీయం కోసం ఉపయోగించుకుంటున్నాయని విమర్శించారు.

సింగరేణి దేశంలోని ఉన్నతమైన ప్రభుత్వరంగ సంస్థల్లో ఒకటని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లోపభూయిష్ట నిర్ణయాలతో సింగరేణిని ఆర్థికంగా, నైతికంగా దెబ్బతీసిందని ఆరోపించారు. చాలావరకు నదీ తీర ప్రాంతాల్లో బొగ్గు లభ్యమవుతుందన్నారు. బొగ్గును వెలికితీసే ప్రయత్నం చేసి... ఉపాధి అవకాశాలు పెంచుతామన్నారు. 

నీట్ పరీక్ష వివాదంపై కూడా కిషన్ రెడ్డి స్పందించారు. నీట్ పరీక్షలో ఎలాంటి లీక్ కాలేదన్నారు. ఒక ప్రశ్నాపత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రం మాత్రమే ఇచ్చారన్నారు. ఆ విషయంలోనూ చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చడం లేదన్నారు. ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి... హామీలను అమలు చేయడం లేదన్నారు. కేవలం ఉచిత ఆర్టీసీ బస్సు హామీని మాత్రమే అమలు చేశారన్నారు. ఇతర హామీలను అన్నింటిని విస్మరించారని మండిపడ్డారు.


More Telugu News