నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రక్షాళనకు ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ప్రకటించిన కేంద్రం

  • సారధ్యం వహించనున్న ఇస్రో మాజీ చీఫ్ రాధాకృష్ణన్
  • పరీక్షలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సిఫార్సులు చేయనున్న నిపుణుల కమిటీ
  • కేంద్ర విద్యాశాఖ కీలక ప్రకటన
యూజీసీ-నెట్ ప్రశ్నాపత్రం లీకైనట్టు గుర్తించి.. పరీక్షను రద్దు చేసిన నేపథ్యంలో అడ్మిషన్లు, రిక్రూట్‌మెంట్‌ కోసం దేశవ్యాప్తంగా పలు పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రక్షాళనపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. పరీక్షలను పారదర్శకంగా, సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సిఫార్సుల కోసం ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఏడుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీకి ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ సారధ్యం వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటన విడుదల చేసింది. 

యూజీసీ-నెట్ నెట్ పరీక్షను రద్దు కావడం, పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమైన నేపథ్యంలో కేంద్రం ఈ చర్యకు ఉపక్రమించింది. పరీక్ష నిర్వహణ ప్రక్రియలో సంస్కరణలు, పరీక్షల సమాచార సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను మరింత మెరుగుపరచడం, ఎన్‌టీఏ నిర్మాణం, పనితీరు పెంపు వంటి అంశాలపై ఉన్నత స్థాయి కమిటీకి సిఫార్సులు చేయనుంది. రెండు నెలల్లోగా నివేదికను అందించాలని కమిటీని కేంద్రం ఆదేశించింది.

కమిటీ సభ్యులు వీరే..
నిపుణుల కమిటీ చైర్మన్‌గా ఇస్రో మాజీ చీఫ్, ఐఐటీ కాన్పూర్ గవర్నర్ల బోర్డు చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ వ్యవహరించనున్నారు. ఎయిమ్స్-ఢిల్లీ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బి జె రావు, ఐఐటీ మద్రాస్‌లోని సివిల్ ఇంజినీరింగ్ విభాగ గౌరవ ప్రొఫెసర్ కె.రామమూర్తి, పీపుల్ స్ట్రాంగ్ సంస్థ సహ వ్యవస్థాపకుడు, కర్మయోగి భారత్ బోర్డు సభ్యుడు పంకజ్ బన్సల్, ఐఐటీ ఢిల్లీ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ ఆదిత్య మిట్టల్ సభ్యులుగా ఉండనున్నారు. ఇక విద్యా మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా ఉన్న గోవింద్ జైస్వాల్‌ సభ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు.


More Telugu News