రైల్వే అధికారులతో గుంటూరులో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష

  • గుంటూరు లోక్ సభ స్థానం నుంచి టీడీపీ ఎంపీగా గెలిచిన పెమ్మసాని
  • కేంద్ర సహాయమంత్రిగా నియామకం
  • బాధ్యతలు చేపట్టాక తొలిసారి గుంటూరు రాక
  • జిల్లాలోని రైల్వే ప్రాజెక్టులపై అధికారులతో చర్చ
కేంద్ర సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తొలిసారిగా గుంటూరు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన గుంటూరులో రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో  రైల్వే ప్రాజెక్టుల పురోగతి, ఫ్లైఓవర్ నిర్మాణాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా  పెమ్మసాని స్పందిస్తూ... గత ఐదేళ్లలో ఇక్కడి రైల్వే ప్రాజెక్టులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని అన్నారు. రైల్వే ప్రాజెక్టులతో ఓట్లు రావన్న ఉద్దేశంతో జగన్ వాటిని పట్టించుకోలేదని విమర్శించారు. గుంటూరు జిల్లాలో రైల్వే బ్రిడ్జిల పరిస్థితిపై అధికారులతో చర్చించినట్టు తెలిపారు. గుంటూరు శంకర్ విలాస్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణంపై అధికారులతో మాట్లాడినట్టు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని వెల్లడించారు. 

నేటి సమీక్ష సమావేశంలో జిల్లాలోని 15 రకాల బ్రిడ్జిల విషయం ప్రస్తావనకు వచ్చినట్టు వివరించారు. ఒక్క గుంటూరు జిల్లా పరిధిలోనే రూ.2 వేల  కోట్ల రైల్వే పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పనులు ఎప్పటి లోగా పూర్తి చేయాలో అధికారులకు నిర్దేశించినట్టు చెప్పారు.


More Telugu News