స్పీకర్ అయ్యన్న పాత్రుడి జీవితాన్ని చాలా గొప్పగా వివరించిన సీఎం చంద్రబాబు

  • ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం
  • అయ్యన్నను చెయిర్ లో కూర్చోబెట్టిన అనంతరం చంద్రబాబు ప్రసంగం
  • అయ్యన్నను స్పీకర్ గా చూడడం ఎంతో గర్వంగా ఉందని వెల్లడి
  • ఏ పదవి ఇచ్చినా వన్నె తెస్తారని ప్రశంసలు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఆయన చైర్ లో కూర్చోబెట్టిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు.

"అధ్యక్షా... తెలుగు రాష్ట్రాల్లోని అత్యంత సీనియర్ శాసనసభ్యుల్లో మీరు ఒకరు. బీసీ నేతగా ఉన్న మిమ్మల్ని నేడు శాసనసభ అధ్యక్ష పదవిలో చూడడం చాలా సంతోషంగా ఉంది. గతంలో మిమ్మల్ని సభలో ఎమ్మెల్యేల మధ్య చూశాం... ఇప్పుడు అధ్యక్ష స్థానంలో చూస్తున్నాం. ఎంతో ఆనందంగానూ, గర్వంగానూ ఉంది. అందరి ఆమోదంతో, 16వ శాసనసభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మీకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. 

ఇవాళ అసెంబ్లీలో చాలా మంది కొత్త శాసనసభ్యులు ఉన్నారు. వారందరూ ఒక్కసారి అయ్యన్నపాత్రుడి జీవితాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. మనందరి మాదిరిగానే ఆయన కూడా ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. 1957 సెప్టెంబరు 4వ తేదీన ఉత్తరాంధ్రలోని నర్సీపట్నంలో జన్మించారు. చింతకాయల వరహాలు దొర, చెల్లాయమ్మ దొర ఆయన తల్లిదండ్రులు. 

ఆనాడు ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించి, యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపు ఇచ్చిన మేరకు అయ్యన్నపాత్రుడు రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటికి ఆయన వయసు 25 సంవత్సరాలు. అక్కడ్నించి ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారిగా ఎంపీగా గెలిచారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో తనదైన ప్రత్యేక ముద్రను వేయగలిగారు. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తీసుకువచ్చిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు. 

ఆయన కుటుంబం 6 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంది. అయ్యన్నపాత్రుడి తాత లచ్చా పాత్రుడు గారు స్వతంత్ర పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు గౌతు లచ్చన్నకు సమకాలికుడు. తాత వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అయ్యన్నపాత్రుడు నేటికీ అదే స్ఫూర్తితో పనిచేస్తున్నారు. 1983, 1985, 1994, 1999, 2004, 2014, 2024లో ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి నర్సీపట్నంలో వారే పోటీ చేస్తున్నారు. అదే అయ్యన్న ప్రత్యేకత! 

ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలవడం, 16 ఏళ్లు మంత్రిగా పనిచేయడం, 1996లో అనకాపల్లి ఎంపీగా గెలుపొందడం, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పదేళ్లు పనిచేయడం... సాంకేతిక విద్య, అటవీ శాఖ, రోడ్లు భవనాల శాఖ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. మూడు సార్లు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. 

అయ్యన్న పాత్రుడు పోరాట యోధుడు, రాజీపడని నాయకుడు, విశిష్టమైన లక్షణాలు ఉండే వ్యక్తి. తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూల ప్రాంతంలోనైనా అయ్యన్నపాత్రుడు గురించి అడిగితే చెబుతారు. ఆయన వయసు 66 సంవత్సరాలు... ఇప్పుడు కూడా ఫైర్ బ్రాండే. ఆయన చివరి క్షణం వరకు ఫైర్ బ్రాండ్ గానే ఉంటారు. ఎక్కడా రాజీనే లేదు. 

మరోవైపు, తన కంటూ ఇక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. విధేయత పరంగా చూస్తే... పార్టీలో కరడుగట్టిన 'పసుపు' యోధుడిగా ఎప్పటికీ ఉంటారు. నీతి, నిజాయతీ, నిబద్ధత పుణికిపుచ్చుకున్న వ్యక్తి... ఆ విధంగానే రాజకీయాలు చేస్తున్నారు. 

ఈ అసెంబ్లీలో చాలామంది మొదటిసారి ఎమ్మెల్యేగా వచ్చిన వాళ్లు ఉన్నారు... కొందరు రెండోసారి ఎమ్మెల్యేలుగా వచ్చిన వాళ్లు ఉన్నారు. కానీ, అయ్యన్నపాత్రుడు 42 ఏళ్లుగా ఒక నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని, అక్కడే ఏడు పర్యాయాలు గెలవడం అనేది ఒక అరుదైన విషయం. చాలామందికి రెండు, మూడు సార్లు గెలిచేసరికి వారి మనస్తత్వం మారిపోతుంది. అయ్యన్నపాత్రుడు అందుకు భిన్నమైన వ్యక్తి. అప్పటికీ ఇప్పటికీ అదే చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. పార్టీని కన్నతల్లిలా భావిస్తూ 42 ఏళ్లుగా పసుపు జెండాను మోస్తూనే ఉన్నారు.

రాష్ట్రాభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధిని కాంక్షించే వ్యక్త అయ్యన్న. ముఖ్యంగా విశాఖ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కోసం పాటుపడ్డారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు నీళ్లు కావాలి, గోదావరి నీళ్లు రావాలి, ఆ ప్రాంతం కూడా బాగుపడాలి... మా కరవు ప్రాంతానికి నీళ్లు కావాలని క్యాబినెట్ మంత్రిగా వెంటపడి సాధించుకున్న వ్యక్తి అయ్యన్న పాత్రుడు. అందుకు ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. 

కష్టాలు అందరికీ వస్తాయి. ఆయన తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోనంత ఇబ్బందులు గత ఐదేళ్లుగా ఎదుర్కొన్నారు. అదీ మామూలుగా కాదు. తన ఇంట్లోకి గోడలు పగలగొట్టుకుని వందల మంది పోలీసులు వచ్చారు. అది కూడా రాత్రివేళ వచ్చి భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఒక పోలీస్ స్టేషన్ లో కాదు... అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు. రాత్రివేళ తీసుకుపోయి ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్ కు తిప్పారు. కానీ ఆయన ఎక్కడా భయపడలేదు. 

ఆయనపై 23 కేసులు పెట్టారు. అందులో 10 కేసులు సీఐడీ వాళ్లే పెట్టారు. అయినప్పటికీ రాజీలేని పోరాటం చేసి ముందుకు వెళ్లారు. 60 ఏళ్లు దాటిన ఆయనపై ఆఖరికి అత్యాచారం కేసు కూడా పెట్టారు. ఎలాంటి పాలకులు ఉన్నారు, అలాంటి పాలకులు ఉంటే ఏం జరుగుతాయో చెప్పడానికి అదొక ఉదాహరణ. 

ఈ సభలో ఉండేవారందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్క నాయకుడి జీవితంలోనూ కొన్ని స్ఫూర్తిదాయక ఘటనలు ఉంటాయి. అయ్యన్న పాత్రుడి జీవితంలో ఉండే పాజిటివ్ అంశాలను మీరు కూడా గమనించాలి" అని స్పష్టం చేశారు.


More Telugu News