టీ20 ప్రపంచకప్.. అమెరికాను చితక్కొట్టేసిన వెస్టిండీస్

  • 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన కరీబియన్ జట్టు
  • వీర విధ్వంసం చేసిన షాయ్ హోప్
  • సూపర్-8 గ్రూప్-2లో రెండో స్థానానికి విండీస్.. అట్టడుగున యూఎస్ఏ
టీ20 ప్రపంచకప్ సూపర్-8 గ్రూప్-2లో ఆతిథ్య దేశం అమెరికాను సహ ఆతిథ్య దేశం వెస్టిండీస్ చితక్కొట్టేసింది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌లో విండీస్ 9 వికెట్ల తేడాతో యూఎస్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా మరో బంతి మిగిలి ఉండగానే 128 పరుగులకు ఆలౌట్ అయింది. 

అనంతరం 129 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కరీబియన్ జట్టు 10.5 ఓవర్లలో వికెట్ మాత్రమే నష్టపోయి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో విండీస్ గ్రూప్-2లో రెండో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లండ్‌పై విజయం సాధించిన సౌతాఫ్రికా ఫస్ట్‌ప్లేస్‌లో ఉంది.

ఓపెనర్ షాయ్ హోప్ బ్యాట్‌తో వీర విజృంభణ చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 39 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ జాన్సన్ చార్లెస్ 17, నికోల్ పూరన్ పరుగులు చేశారు. 

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏను విండీస్ బౌలర్లు బెంబేలెత్తించారు. రసెల్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోస్టన్ చేజ్ చెరో మూడు వికెట్లు తీసుకోగా, అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. మూడు పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన అమెరికా ఏ దశలోనూ నిలదొక్కుకోలేకపోయింది. ఓపెనర్ ఆండ్రీస్ గౌస్ చేసిన 29 పరుగులే అత్యధికం. ఎన్ఆర్ కుమార్ 20, మిలింద్ కుమార్ 19, వాన్ ష్కల్క్‌విక్ 18 పరుగులు చేశారు. అలీఖాన్ 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అనూహ్యంగా సూపర్-8లోకి దూసుకొచ్చిన అమెరికా వరుసగా రెండు ఓటములతో అట్టడుగున ఉంది.


More Telugu News