తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న‌ వైసీపీ కార్యాలయం కూల్చివేత!

  • నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ కూల్చివేసిన సీఆర్‌డీఏ అధికారులు 
  • నీటిపారుదల శాఖ స్థలంలో భవనం నిర్మిస్తున్నందుకే చర్యలు తీసుకున్నామని వివరణ 
  • భవనం కూల్చేయాలన్న సీఆర్‌డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్‌చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన‌ వైసీపీ
నిబంధనలకు విరుద్ధంగా ఉందని అమరావతిలోని తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్‌డీఏ అధికారులు కూల్చేశారు. తాడేపల్లి మండలం సీతానగరం వద్ద నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని ఇవాళ‌ ఉద‌యం 5.30 గంట‌ల ప్రాంతంలో పోలీసుల పహారా మధ్య ప్రొక్లెయినర్లు, బుల్డోజర్లతో సీఆర్‌డీఏ అధికారులు కూల్చేశారు. ఫస్ట్‌ ఫ్లోర్‌ పూర్తయి, శ్లాబ్ కు సిద్ధమవుతున్న టైంలో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. నీటిపారుదల శాఖ స్థలంలో భవనం నిర్మిస్తున్నారని, అందుకే చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు.

కూల్చే స‌మ‌యంలో అటుగా కార్యకర్తలు, నేతలు రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. త‌ర్వాత‌ భారీ భద్రత మధ్య కూల్చివేతలు సాగాయి. ఇక నిర్మాణంలో ఉ‍న్న ఈ భవనాన్ని కూల్చేయాలన్న సీఆర్‌డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్‌చేస్తూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇదే విషయాన్ని సీఆర్‌డీఏ కమిషనర్‌ దృష్టికి వైసీపీ న్యాయవాది తీసుకెళ్లారు. అయినప్పటికీ సీఆర్‌డీఏ కూల్చివేతలు చేపట్టింది. ఇదే విషయాన్ని మరోసారి హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని వైసీపీ చెబుతోంది.


More Telugu News