ప్రియాంక గాంధీ తరపున వయనాడ్‌లో మమతా బెనర్జీ ప్రచారం!

  • కాంగ్రెస్, టీఎంసీ మధ్య విభేదాలకు ఫుల్ స్టాప్
  • మమతా బెనర్జీతో స్వయంగా సమావేశమైన కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం
  • ఈ నేపథ్యంలో ప్రియాంక తరపున మమత ప్రచారం చేయనున్నట్టు వార్తా కథనాలు
కాంగ్రెస్, టీఎంసీ మధ్య మళ్లీ సఖ్యత కుదిరినట్టు తెలుస్తోంది. వయనాడ్ నుంచి బరిలోకి దిగిన ప్రియాంక గాంధీ తరపున స్వయంగా ప్రచారం చేసేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పశ్చిమ బెంగాల్ సెక్రటేరియట్‌లో సీఎంతో కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం సమావేశమైన అనంతరం ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం

పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి, మమతా బెనర్జీల మధ్య పొసగట్లేదన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో టీఎంసీ- కాంగ్రెస్‌ పొత్తు చర్చలు విఫలం కావడానికి అధీర్ రంజన్ చౌదరి కారణమని టీఎంసీ అధినేత్రి భావిస్తున్నారు. అయితే, ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ బీజేపీపై పైచేయి సాధించింది. రాష్ట్రంలోని 42 లోక్ సభ స్థానాలకు గాను 29 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో పార్టీ కీలక నేత అభిషేక్ బెనర్జీ.. కాంగ్రెస్ ఇండియా కూటమి నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. అనేక అంశాలపై ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నించారు. తొలుత సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌తో, ఆ తరువాత ఆప్ నేత రాఘవ్ ఛద్దా, అనంతరం, ముంబైలో ఉద్ధవ్ థాకరేతో సమావేశమయ్యారు. ఇక టీఎంసీ ఎంపీలు  కల్యాణ్ బెనర్జీ, సాగరికా ఘోసే, సాకేత్ గోఖలేలు ఎగ్జిట్ పోల్స్ అవకతవకలపై దర్యాప్తుకు డిమాండ్ చేస్తూ ఎన్సీపీ నేతలతో కలిసి ధర్నా నిర్వహించారు. అయితే, ఈ ధర్నాకు కాంగ్రెస్ మాత్రం దూరంగా ఉండాల్సి వచ్చింది. 

ఈ నేపథ్యంలో టీఎంసీ అధినేత్రిని ప్రసన్నం చేసుకునేందుకు చిదంబరం నేరుగా చర్చలకు దిగారు. మరోవైపు, అధీర్ రంజన్ చౌదరి కూడా సీఎంపై తన విమర్శలకు తాత్కాలిక బ్రేకులు వేశారు. తనకు మమతతో రాజకీయంగా తప్ప వ్యక్తిగత అభిప్రాయభేదాలు ఏమీ లేవంటూ సంచలన ప్రకటన చేశారు. ఈ క్రమంలో సీఎం మమత కూడా ప్రియాంక గాంధీ తరపున వయనాడ్‌లో ప్రచారం చేయనున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


More Telugu News