జేడీఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ సూరజ్ రేవణ్ణ నాపై లైంగికదాడికి పాల్పడ్డాడు.. యువకుడి ఫిర్యాదు

  • సెక్స్ కుంభకోణంలో ఇప్పటికే అరెస్ట్ అయిన ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ
  • ఇప్పుడు రేవణ్ణ పెద్ద కుమారుడిపై ఆరోపణలు
  • ఉద్యోగం పేరుతో బెదిరించి లోబరుచుకున్నారని ఫిర్యాదు
  • డీజీపీ, ఎస్పీ, సీఎంకు 15 పేజీల లేఖ రాసిన బాధితుడు
  • బాధిత యువకుడి శరీరంపై గాయాలు
  • ఖండిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సూరజ్ సన్నిహితుడు
కర్ణాటకలోని హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ వ్యవహారం మర్చిపోకముందే అదే హసన్ లో అలాంటి వ్యవహారమే మరొకటి వెలుగులోకి వచ్చి సంచలనమైంది. ఇది కూడా ఆయన కుటుంబం చుట్టే తిరుగుతోంది.

జేడీఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ సూరజ్ రేవణ్ణ తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని, అతడి వేధింపులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని, ప్రతిఘటించినందుకు ఇప్పుడు తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ జేడీఎస్ కార్యకర్త (25) ఒకరు డీజీపీ, హసన్ ఎస్పీ, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశాడు. మొత్తం 15 పేజీల లేఖ రాసిన బాధితుడు అందులో తనపై జరుగుతున్న లైంగికదాడికి సంబంధించి పలు ఆరోపణలు చేశాడు. సెక్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి రేవణ్ణ పెద్ద కుమారుడే డాక్టర్ సూరజ్ రేవణ్ణ.

తనకు ఉద్యోగం ఇస్తానని, తనను ఆర్థికంగా ఆదుకుంటానని నమ్మించి, ఆపై బెదిరించిన ఎమ్మెల్సీ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించాడు. బాధిత యువకుడికి పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించగా అతడి శరీరంపై గాయాలు ఉన్నట్టు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని, అతడి ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నట్టు ఎస్పీ మహ్మద్ సజీదా తెలిపారు. 

అయితే, యువకుడి ఆరోపణలను ఎమ్మెల్సీ సన్నిహితుడు ఖండించారు. కార్యకర్త రూ. 5 కోట్లు డిమాండ్ చేశాడని, అందుకు నిరాకరించడంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని పేర్కొంటూ హొళెనరసీపుర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


More Telugu News