డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం

  • ఏపీలో పలు చోట్ల ప్రబలుతున్న డయేరియా
  • అధికారులతో సమీక్ష చేపట్టి ఆదేశాలు జారీ చేసిన పవన్ కల్యాణ్
  • జిల్లా కలెక్టర్లు, అధికారులతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్
  • డయేరియా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్ దిశానిర్దేశం
ఏపీ డిప్యూటీ సీఎం, తాగునీటి సరఫరా శాఖ మంత్రి పవన్ కల్యాణ్ నేడు రాష్ట్రంలో డయేరియా పరిస్థితుల పట్ల సమీక్ష నిర్వహించి, అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. పవన్ ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం వెంటనే కదిలింది. డయేరియా కట్టడిపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ స్పష్టం చేశారు. మంచినీటి పైప్ లైన్లు, ఓహెచ్ఎస్ఆర్ లీకేజిలు లేకుండా చూడాలని ఆదేశించారు. 217 నీటి వనరులలో కాలుష్యం ఉన్నట్టు గుర్తించినట్టు సీఎస్ తెలిపారు. 

జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు డయేరియా నియంత్రణపై రాష్ట్ర వ్యాప్త ప్రచారం చేపట్టాలని నిర్దేశించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. 

కాగా, డయేరియాతో అనేకమంది అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లో చేరడం పట్ల సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆరా తీశారు. ఫిబ్రవరిలో ఒకరు డయేరియాతో మృతి చెందిన విషయాన్ని ఆయన అధికారులకు గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆదేశించారు.


More Telugu News