దలైలామాపై చైనాకు స్పష్టమైన వైఖరి తెలియజేసిన భారత్

  • దలైలామా స్వేచ్ఛగా మత కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు స్వేచ్ఛ ఉందన్న భారత్
  • ఆయనంటే భారత ప్రజలకు అపార గౌరవమని వ్యాఖ్య
  • దలైలామాను అమెరికా ప్రతినిధుల బృందం కలవడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వేళ కీలక వ్యాఖ్యలు
హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాల బౌద్ధాశ్రమంలో టిబెట్ ఆధ్యాత్మికవేత్త, మతగురువు దలైలామాను అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ఇటీవల కలవడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వేళ భారత్ స్పందించింది. దలైలామాపై స్పష్టమైన వైఖరిని చైనాకు తెలియజేసింది. 

దలైలామా అత్యంత గౌరవనీయులైన ఆధ్యాత్మిక గురువు, ఆయనంటే భారత ప్రజలకు అపారమైన గౌరవం ఉందని భారత్ పేర్కొంది. దలైలామా పవిత్రతకు తగిన మర్యాదలు, ఆయన ఇక్కడ మతపరమైన, ఆధ్యాత్మిక కార్యకలాపాలను నిర్వహించుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల బృందం అత్యున్నత స్థాయి పర్యటనపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

కాగా కాంగ్రెస్ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసి సారధ్యంలోని ఏడుగురి సభ్యుల కాంగ్రెస్ బృందం జూన్ 16 నుంచి 20 మధ్య భారత్‌లో పర్యటించింది. ప్రధాని మోదీ, భారత విదేశాంగ, వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రులను కూడా కలిశారు. ఈ బృందం ధర్మశాలకు వెళ్లి దలైలామాను కూడా కలిసింది. ఇందుకు సంబంధించిన వార్తలు వెలువడిన వెంటనే చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.


More Telugu News