కిమ్ ను కారులో తిప్పిన పుతిన్.. వీడియో ఇదిగో!

  • పక్కన కిమ్ ను కూర్చోబెట్టుకుని కారు నడిపిన రష్యా ప్రెసిడెంట్
  • లగ్జరీ కారును నార్త్ కొరియా సుప్రీం లీడర్ కు బహుమతిగా ఇచ్చిన పుతిన్
  • వీడియో రిలీజ్ చేసిన రష్యా అధికారిక మీడియా
ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ లు సరదాగా కారులో ప్రయాణించారు. పుతిన్ డ్రైవింగ్ చేస్తుండగా పక్కనే కూర్చుని కిమ్ నవ్వుతూ మాట్లాడుతున్న వీడియోను రష్యా అధికారిక మీడియా విడుదల చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. రష్యాలో తయారైన లగ్జరీ కారు ఆరస్ లిమోసిన్ లో ఇరు దేశాధినేతలు ప్రయాణించారు. నలుపు రంగు ఆరస్ కారు రష్యాలో ప్రెసిడెంట్ అధికారిక వాహనం. ఈ వాహనంలో కిమ్ ను కూర్చోబెట్టుకుని ఓ పార్క్ లో పుతిన్ డ్రైవ్ చేశారు. అనంతరం ఇరువురు నేతలు ఓ భవనంలోకి వెళ్లడం వీడియోలో కనిపిస్తోంది. కాగా, బ్లాక్ కలర్ ఆరస్ కారును పుతిన్ నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ కు బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. గత ఫిబ్రవరిలోనూ ఇలాంటి కారునే కిమ్ కు పుతిన్ గిఫ్టిచ్చారు. దీంతో రిటర్న్ గిఫ్ట్ గా పుతిన్ కు పంగ్సన్ జాతికి చెందిన రెండు కుక్క పిల్లలను అందించినట్లు సమాచారం.

కిమ్ జోంగ్ ఉన్ వాహన ప్రియుడు.. లగ్జరీ కార్లంటే ఆయనకు చాలా ఇష్టం. వివిధ కంపెనీలకు చెందిన లగ్జరీ కార్లను కిమ్ సేకరిస్తుంటారు. అయితే, ఉత్తర కొరియాపై ఐక్యరాజ్య సమితి ఆంక్షల నేపథ్యంలో ఆయా కంపెనీల నుంచి నేరుగా కార్లను కొనడం కిమ్ కు సాధ్యం కాదు. దీంతో తనకు నచ్చిన విదేశీ కారును నార్త్ కొరియాలోకి స్మగ్లింగ్ ద్వారా తెప్పించుకుంటారు. కిమ్ దగ్గర ప్రస్తుతం రష్యాలో తయారైన లిమొసిన్ కార్లతో పాటు వివిధ దేశాలలో తయారైన లగ్జరీ కార్లు మెర్సిడెస్, రోల్స్ రాయిస్, ఫాంటమ్, లెక్సస్ తదితర కార్లు ఉన్నాయి.


More Telugu News