పవన్ కల్యాణ్ ఓఎస్‌డీగా యువ ఐఏఎస్.. చంద్రబాబు ప్రత్యేక అనుమతి

  • ఓఎస్‌డీగా 2015 ఐఏఎస్ అధికారి కృష్ణతేజ‌‌ ఎంపిక
  • కృష్ణతేజ స్వస్థలం పల్నాడు జిల్లా చిలకలూరిపేట
  • ప్రస్తుతం కేరళలోని త్రిసూర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న వైనం
  • ఆయన నియామకం కోసం చంద్రబాబు ప్రత్యేక అనుమతి, కేంద్రానికి లేఖ
  • బాలల హక్కుల సంరక్షణలో త్రిసూర్‌ను టాప్‌లో నిలిపిన కృష్ణతేజ
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా యువ ఐఏఎస్ అధికారి మైలవరపు వీఆర్ కృష్ణతేజ రానున్నారు. ఏపీకి చెందిన కృష్ణతేజ ప్రస్తుతం కేరళలోని త్రిసూర్ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన స్వస్థలం పల్నాడు జిల్లా చిలకలూరిపేట. 

సాధారణంగా ఆర్‌డీఓ స్థాయి అధికారులను మంత్రులకు ఓఎస్‌డీలుగా నియమిస్తారు. కానీ పవన్ కల్యాణ్ కోసం ఐఏఎస్ అధికారి అయిన కృష్ణ తేజ నియామకానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. ఆయనను డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి పంపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. 

కృష్ణతేజ గతంలో కేరళ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ, పర్యాటకశాఖ డైరెక్టర్, ఎస్సీ అభివృద్ధిశాఖ డైరెక్టర్, అలప్పుజ జిల్లా కలెక్టర్‌గా సేవలందించారు. కాగా, రెండు రోజుల క్రితం కృష్ణతేజ సచివాలయంలో పవన్ కల్యాణ్‌ను కలిసి వెళ్లారు. 

త్రిసూర్ జిల్లా కలెక్టర్‌గా కృష్ణతేజ అందించిన సేవలకు గాను జాతీయ బాలల రక్షణ కమిషన్ ఆయనను పురస్కారానికి ఎంపిక చేసింది. బాలల హక్కుల రక్షణలో త్రిసూర్ జిల్లాను ఆయన దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఆయిన కృష్ణతేజ.. 2023లో మార్చిలో కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన 609 మంది విద్యార్థులను గుర్తించి, దాతల సహకారంతో ఉన్నత చదువులకు చేయూత అందించారు. కరోనా సమయంలో భర్తలను పోగొట్టుకున్న 35 మంది వితంతువులకు ఇళ్లు నిర్మించడంతో పాటు 150 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఐఏఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన అద్భుత పనితీరుతో తనదైన ముద్ర వేస్తున్నారు.


More Telugu News