సూర్య ప్ర‌తాపం.. ఆఫ్ఘ‌నిస్థాన్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం!

  • బార్బడోస్‌లోని కెన్సింగ్ట‌న్ ఓవల్ వేదిక‌గా భార‌త్‌, ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్‌
  • 47 ప‌రుగుల తేడాతో టీమిండియా బంప‌ర్ విక్ట‌రీ
  • భార‌త్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు
  • 134 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన ఆఫ్ఘ‌నిస్థాన్
  • చెరో మూడు వికెట్ల‌తో విజృంభించిన బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ 
  • 53 ర‌న్స్ తో కీల‌క ఇన్నింగ్స్ ఆడిన సూర్యకు 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు 
టీ20 వరల్డ్ క‌ప్‌లో భాగంగా బార్బడోస్‌లోని కెన్సింగ్ట‌న్ ఓవల్ వేదిక‌గా భార‌త్‌, ఆఫ్ఘనిస్థాన్ మ‌ధ్య జ‌రిగిన సూప‌ర్‌-8 మ్యాచ్‌లో టీమిండియా ఘ‌న విజయం సాధించింది. రోహిత్ సేన నిర్దేశించిన 182 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో ఆఫ్ఘ‌నిస్థాన్ 134 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో భార‌త జ‌ట్టు 47 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.  

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు చేసింది. మిస్ట‌ర్ 360 సూర్యకుమార్ యాదవ్ అర్ధ శ‌త‌కం (53)తో రాణించాడు. అత‌నికి హార్దిక్ పాండ్యా (32) సమయోచితంగా ఆడి తోడ్పాటు అందించాడు. ఇక సూర్య 28 బంతుల్లో 5 బౌండ‌రీలు, 3 సిక్సుల సాయంతో 53 పరుగులు బాదాడు. హార్దిక్ పాండ్యా 24 బంతుల్లో (3 ఫోర్లు, 2 సిక్సులు) 32 పరుగుల‌తో బ్యాట్ ఝుళిపించాడు. కోహ్లీ 24, పంత్ 20 ప‌రుగుల‌తో ప‌ర్వాలేద‌నిపించ‌గా.. అక్షర్ పటేల్ 12, శివమ్ దూబే 10, రోహిత్ శ‌ర్మ 8 మ‌రోసారి నిరాశ‌ప‌రిచారు. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లలో సార‌ధి రషీద్ ఖాన్, ఫజల్ హక్ ఫరూఖీ చెరో 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. నవీనుల్ హక్ 1 వికెట్ తీశాడు.

అనంత‌రం 182 ప‌రుగుల ల‌క్ష్య‌ఛేద‌న‌తో బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘన్ ఆది నుంచే త‌డ‌బ‌డింది. 23 ప‌రుగుల‌కే కీల‌క‌మైన 3 వికెట్లు పారేసుకుంది. ఇన్నింగ్స్ మ‌ధ్య‌లో గుల్బ‌దీన్ నైబ్‌, అజ్మ‌తుల్లా కొద్దిసేపు భార‌త బౌల‌ర్ల‌ను దీటుగా ఎదుర్కొన్నారు. ఈ ద్వ‌యం 44 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పింది. ఈ జోడీ నిష్క్ర‌మ‌ణ త‌ర్వాత ఆఫ్ఘనిస్థాన్ బ్యాట‌ర్లు వ‌రుస‌గా పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. బుమ్రా, అర్ష్‌దీప్ విజృంభించ‌డంతో ర‌షీద్ సేన‌ 20 ఓవ‌ర్ల‌లో 134 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. దీంతో భార‌త్ జ‌ట్టు 47 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. 

ఆఫ్ఘన్ బ్యాట‌ర్ల‌లో అజ్మ‌తుల్లా 26 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్ కాగా, జ‌ద్రాన్ 19, నైబ్ 17, న‌బీ 14 ర‌న్స్ చేశారు. భార‌త బౌల‌ర్ల‌లో జ‌స్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ త‌లో 3 వికెట్లు తీయ‌గా, కుల్దీప్ 2, అక్ష‌ర్ ప‌టేల్, ర‌వీంద్ర జ‌డేజా చెరో వికెట్ ప‌డ‌గొట్టారు. 28 బంతుల్లో 53 ప‌రుగుల‌తో కీల‌క ఇన్నింగ్స్ ఆడిన సూర్య కుమార్ యాద‌వ్ 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు ద‌క్కించుకున్నాడు.

రోహిత్ శ‌ర్మ‌ ఖాతాలో చెత్త రికార్డు
టీ20 ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ చెత్త రికార్డు నెల‌కొల్పాడు. ఈ మెగా టోర్నీలో అత్య‌ధిక సార్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కు ప‌రిమిత‌మైన ఇండియ‌న్ బ్యాట‌ర్‌గా హిట్‌మ్యాన్ (11) నిలిచాడు. ఆఫ్ఘన్‌తో మ్యాచ్‌లో రోహిత్ 8 ప‌రుగులే చేసిన విష‌యం తెలిసిందే. త‌ద్వారా ఈ చెత్త రికార్డు అత‌ని ఖాతాలో చేరింది. హిట్‌మ్యాన్ త‌ర్వాత యువ‌రాజ్ సింగ్ (8), సురేశ్ రైనా (7), గౌత‌మ్ గంభీర్ (5), విరాట్ కోహ్లీ (5), కేఎల్ రాహుల్ (5) ఉన్నారు.


More Telugu News