భారీ సంఖ్య‌లో మాతృదేశాన్ని వీడుతున్న భారతీయ మిలియనీర్లు.. వెల్త్ మైగ్రేషన్ రిపోర్టులో షాకింగ్ విష‌యాలు!

  • 2024లో దాదాపు 4,300 మంది మిలియనీర్లు భారత్‌ను వీడ‌నున్నార‌న్న హెన్లీ అండ్‌ పార్టనర్స్‌ రిపోర్టు
  • చైనా, బ్రిట‌న్‌, భార‌త్ నుంచి మిలియనీర్ల వలసలు అధికంగా ఉన్న‌ట్లు నివేదిక వెల్ల‌డి
  • ఈ రిపోర్టు ప్ర‌కారం 2023లో 5,100 మంది భారతీయ కోటీశ్వ‌రులు ఇత‌ర దేశాల‌కు వ‌ల‌స
  • ఇండియాను వీడుతున్న‌ మిలియనీర్లలో అధికంగా వ‌ల‌స వెళ్లేది యూఏఈకి
కంపెనీలు స్థాపించి వందలాది మందికి ఉపాధి కల్పించాల్సిన కోటీశ్వరులైన వ్యాపారులు భారత్‌ను వీడుతున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది దాదాపు 4,300 మంది మిలియనీర్లు భారత్‌ను విడిచిపెట్టి విదేశాలకు వెళ్లనున్నారు. ఈ మేరకు హెన్లీ అండ్‌ పార్టనర్స్‌ రిపోర్టు-2024 పేర్కొంది. మిలియనీర్ల వలసలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో చైనా, యూకే వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉండగా భారత్‌ మూడో స్థానంలో నిలవడం గమనార్హం. 

ఇక ఈ రిపోర్టు ప్ర‌కారం గ‌తేడాది దాదాపు 5,100 మంది భారతీయ కోటీశ్వ‌రులు ఇత‌ర దేశాల‌కు వ‌ల‌స వెళ్ల‌డం జ‌రిగింది. అలాగే భారతదేశం పెద్ద సంఖ్యలో మిలియనీర్లను కోల్పోతోందని చెప్పిన నివేదిక‌.. ఇండియా నుంచి వెళ్తున్న మిలియనీర్లలో అధికంగా యూఏఈకి వ‌ల‌స వెళ్తున్న‌ట్లు పేర్కొంది. దీంతో మిలియనీర్ల వలసలతో యూఏఈ అతిపెద్ద లబ్దిదారుగా మారిందని తెలిపింది. 

2024లో మొత్తంగా 6,800 మంది మిలియనీర్లు ఆ దేశానికి వ‌ల‌స‌ వెళ్లే అవ‌కాశం ఉంద‌ని నివేదిక పేర్కొంది. కాగా, యూఏఈ త‌ర్వాతి స్థానాల్లో అమెరికా, సింగపూర్ ఉన్నాయి. 2013 నుంచి 2023 మధ్య కాలంలో యూఏఈలో భారతీయ మిలియనీర్లు 85 శాతం పెరగ‌డం గ‌మ‌నార్హం. 

ఇక ఈ నివేదిక ప్ర‌కారం 3,26,400 హెచ్‌ఎన్‌డబ్ల్యుఐ (అధిక నికర విలువ గల వ్యక్తులు) లతో మిలియనీర్‌లకు సంబంధించి భారతదేశం ప్రపంచంలో ప‌దో స్థానంలో ఉంది. చైనా 8,62,400 మందితో రెండో స్థానంలో కొన‌సాగుతోంది. అలాగే బిలియ‌నీర్ల విష‌యానికి వ‌స్తే.. 120 మంది బిలియనీర్లతో ఇండియా ప్ర‌పంచంలో మూడో స్థానంలో ఉంది. కాగా, ఈ సంఖ్య చైనాలో మూడో వంతుగా ఉంటే.. అమెరికాలో ఎనిమిదో వంతు అని నివేదిక వెల్ల‌డించింది.

వలసలకు కారణాలేంటి?
దేశంలో నెలకొన్న పరిస్థితులు, కేంద్రం తీసుకొస్తున్న కొత్త నిబంధనల పట్ల విసుగెత్తే మిలియనీర్లు మాతృదేశాన్ని విడిచిపెట్టి బయటి దేశాలకు వలస వెళ్తున్నట్టు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు దేశంలో భద్రత, ఆర్థిక పరిస్థితులు, పన్ను ప్రయోజనాలు, వ్యాపారావకాశాలు, పిల్లలకు విద్యావకాశాలు, వైద్యం, జీవన ప్రమాణాలను బేరీజు వేసుకున్న తర్వాతనే ఇండియన్‌ మిలియనీర్లు ఇతర దేశాలకు వలస వెళ్తున్నట్టు హెన్లీ నివేదిక తెలిపింది.


More Telugu News